Chandra Arya In Canada PM Race : జస్టిన్ ట్రూడో రాజీనామాతో ఖాళీ అయిన కెనడా ప్రధానమంత్రి పదవికి భారీ పోటీ నెలకొంది. ఈ రేసులో తాను కూడా ఉన్నానని నేపియన్ ప్రాంత ఎంపీ చంద్ర ఆర్య గురువారం ప్రకటించారు. తప్పకుండా తాను ప్రధాని పదవికి పోటీ పడతానని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన సందేశంతో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. కెనడా పునర్నిర్మాణానికి దోహదం చేసేలా ప్రభుత్వాన్ని సమర్ధంగా నడపగలనని ఎంపీ చంద్ర ఆర్య విశ్వాసం వ్యక్తం చేశారు. కెనడా భావితరాల వికాసం కోసం సురక్షితమైన మార్గాన్ని తాను నిర్మించగలనని ఆయన తెలిపారు.
ఆర్థిక వ్యవస్థను పట్టాలు ఎక్కిస్తా!
‘‘నేను మొదటి నుంచీ కెనడా ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాను. మన పిల్లలు, మనవళ్లు/మనవరాళ్ల కోసం కొన్ని సాహసోపేత నిర్ణయాలను తీసుకోక తప్పదు’’ అని ఎంపీ చంద్ర ఆర్య తెలిపారు. ‘‘ఒకవేళ నన్ను అధికార లిబరల్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంటే, యావత్ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి కెనడా ఉన్నతికి బాటలు వేస్తాను. మునుపెన్నడూ లేని కొన్ని నిర్మాణాత్మక సమస్యలను కెనడా ఎదుర్కొంటోంది. వాటిని పరిష్కరించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కెనడా ఆర్థిక వికాసంలో చాలా మంది కెనడియన్లు భాగం కాలేకపోతున్నారు. ప్రత్యేకించి యువత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు’’ అని చంద్ర ఆర్య వివరించారు. ప్రధానిగా ఎన్నికైతే కెనడా ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలు ఎక్కించగలనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
I am running to be the next Prime Minister of Canada to lead a small, more efficient government to rebuild our nation and secure prosperity for future generations.
— Chandra Arya (@AryaCanada) January 9, 2025
We are facing significant structural problems that haven’t been seen for generations and solving them will require… pic.twitter.com/GJjJ1Y2oI5
నాకు మద్దతుగా నిలవండి
‘‘కెనడాలో మధ్యతరగతి ప్రజలు పెనుసవాళ్లను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి ఉద్యోగాలతో జీవితం వెళ్లదీస్తున్న ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారుకుంటున్నాయి. కెనడా సమాజం సుస్థిరంగా ముందడుగు వేయాలంటే ఆర్థిక పునర్వికాసం ఆవశ్యకం. అది నేను చేసి చూపించగలను’’ అని ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. కెనడా ప్రజల కోసం చాలా మంచి ఆర్థిక అవకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ‘‘పెద్దపెద్ద నిర్ణయాలను తీసుకోవడంలో భయపడని బలమైన నాయకత్వం మన కెనడాకు కావాలి. అలాంటి నిర్ణయాలే కెనడా పునర్నిర్మాణానికి బాటలు వేస్తాయి. దేశ ప్రజల్లో ఆశను మళ్లీ సజీవం చేస్తాయి. అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తాయి. భావితరాల భవితను సురక్షితంగా మారుస్తాయి. సాహసోపేత నిర్ణయాలు ఐచ్ఛికం కాదు తప్పనిసరి. కెనడా ప్రధానిగా అవకాశమిస్తే నేను ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే చొరవను చూపగలను’’ అని ఆయన వెల్లడించారు. ఈక్రమంలో తనకు మద్దతుగా నిలవాలని కెనడా ప్రజలకు చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. గత సోమవారమే (జనవరి 6న) కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా సేవలు అందిస్తున్నారు.
రేసులో భారత సంతతి నేతలు
జస్టిన్ ట్రూడో వైదొలిగిన తర్వాత, కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌లు ఉన్నారు. వీరితోపాటు భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.