National Pest Surveillance System Mobile APP : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను అన్నదాతలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా జాతీయ చీడ పీడల నిఘా వ్యవస్థ అనే మొబైల్ యాప్‌ను నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టం పేరుతో సిద్ధం చేసింది.
కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, స్టోరేజీ కార్యాలయం, క్వారంటైన్ ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సహాయంతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. రైతన్నలకు అవగాహన కల్పించే బాధ్యతను కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రానికి అప్పగించారు. యాప్‌లో రైతు పేరు, ఫోన్ నంబర్, గ్రామం, పంట, పంట దశ, పంట కాలం, చీడపీడల రకం, ప్రదేశం ఇతర వివరాలు నిక్షిప్తం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు సంబంధిత పంట సమాచారం, సస్యరక్షణ సూచనలు అందుతాయి. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 20 మంది అభ్యుదయ రైతులతో పాటు వ్యవసాయాధికారులకు దీని వాడకంపై అవగాహన కల్పించారు. వీరు తోటి అన్నదాతలకు దీని ఉపయోగాలు వివరించారు. అలాగే సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ చేపట్టారు.
ఉపయోగాలు ఇవీ : -
- పంట క్షేత్రానికి వెళ్లి చీడ పీడలు ఆశిస్తే నేరుగా మొబైల్ ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి.
- పంట పేరు నమోదు ఎంటర్ చేస్తే తెగుళ్లు ఉన్నాయా?, ఏ పురుగు సొకింది?, లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ చర్యలు ఏం తీసుకోవాలనే సమగ్ర సమాచారం రైతులకు వస్తుంది.
- సకాలంలో చీడ పీడలను గుర్తించి నివారణకు సత్వర సమాచారం పొందవచ్చు.
- వలస పురుగులని త్వరగా కనిపెడుతుంది. మనం నివారణ చర్యలు తీసుకోవచ్చు.
- టైం, పెట్టుబడి ఖర్చు తగ్గించి దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంటుంది.
- ప్రత్యేక రకమైన వైరస్‌లు వచ్చినప్పుడు వాటి నియంత్రణకు వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించి రైతులను అలర్ట్ చేయవచ్చు.
ప్రతి మంగళవారం రైతు వేదికల్లో శిక్షణ : ప్రస్తుతం ఈ యాప్ ప్రత్యేకతలపై ఉమ్మడి జిల్లాలో 20 మందికి రైతులకు అవగాహన కల్పించామని కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంటు ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి ఉదయ్ శంకర్ అన్నారు. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో శిక్షణ సదస్సుల్లో చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు. అన్నదాతల వద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటంతో యాప్‌ను ఉపయోగిస్తే త్వరితగతిన చీడ పీడలను గుర్తించి, సస్యరక్షణ చర్యలు చేపడతారని వివరించారు. ప్రస్తుతం ఆంగ్లం, హిందీ, మరాఠీ, గుజరాతీ, భాషల్లో ఉందని, ఇంకో 15 రోజుల్లో తెలుగులోనూ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
వ్యవసాయశాఖ సరికొత్త ఆలోచన... ఆ వివరాల నమోదుకు ప్రత్యేక మొబైల్ యాప్