UPSC CSE Exam 2025 New Rules : యూపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్. కొత్త నిబంధల ప్రకారం, ఇకపై సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కోటాకు సంబంధించిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి.
గతంలో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తరువాత మాత్రమే అభ్యర్థులు తమ వయస్సు, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారి పూజా ఖేద్కర్ తప్పుడు ఓబీసీ, మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి, వికలాంగుల కోటాలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె ఈ ఆరోపణలు అన్నింటినీ ఖండించారు. ఏదేమైనప్పటికీ ఈ వివాదం నేపథ్యంలో యూపీఎస్సీ ఇకపై ప్రిలిమినరీ పరీక్షకు ముందే సదరు పత్రాలు సమర్పించాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
పరీక్షలు ఎలా జరుగుతాయంటే?
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులను ఎంపిక చేయడానికి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది.
ఈ పత్రాలు తప్పనిసరి!
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రూల్స్-2025 ప్రకారం,' సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి. అప్లికేషన్లో పుట్టిన తేదీ, కులం లేదా వర్గం (ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు), విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్‌లను కచ్చితంగా పేర్కొనాలి. అలాగే వాటిని రుజువు చేసే పత్రాలను కచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ దరఖాస్తుతోపాటు ఈ పత్రాలు సమర్పించని పక్షంలో అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.'
కేటగిరీలవారీగా పోస్టుల వివరాలు
ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 25న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా సుమారుగా 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో దివ్యాంగులకు 38 పోస్టులు కేటాయించారు. అంధత్వం లేదా దృష్టి తక్కువ ఉన్న అభ్యర్థులకు 12 పోస్టులు; చెవిటి వారికి 7; సెరిబ్రల్ పాల్సీ, కుష్టు వ్యాధి నయమైన వారు, మరుగుజ్జులు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, లోకోమోటర్ వైకల్యం ఉన్నవారికి 10; బహుళ వైకల్యం ఉన్నవారికి 9 పోస్టులు ఉన్నాయి.
ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు రిజర్వేషన్లు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు http://upsconline.gov.in వైబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. సివిల్ సర్వీసుల్లో లింగ సమతుల్యతను సాధించాలని ప్రభుత్వం సంకల్పించింది. కనుక మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని పోత్సహిస్తోంది.