Governor Jishnu Dev Varma Approves Bhu Bharathi Bill : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూ భారతి బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెలలో ఈ బిల్లుకు అసెంబ్లీ, మండలి పచ్చజెండా ఊపాయి. డిసెంబరు 31న బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపగా, పరిశీలించిన అనంతరం తాజాగా ఆమోద ముద్ర వేశారు. దీంతో నూతన రెవెన్యూ చట్టం (ఆర్వోఆర్)-2025 రూపుదాల్చింది. చట్టం ప్రతులను గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అందజేశారు.
ఈ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్నదే లక్ష్యం : భూ భారతి బిల్లుకు ఆమోదం లభించడం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ, రెవెన్యూ చట్టం-2020తో రాష్ట్రంలో సామాన్య ప్రజలు, అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ చట్టం అమల్లోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచినా విధి విధానాలను రూపొందించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో భూ సమస్య లేని గ్రామం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని విమర్శించారు.
గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లో ఉన్న రెవెన్యూ సేవలను గ్రామ స్థాయి వరకు అందించడానికి తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రతి ఊరికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ విభాగం పని చేయాలని, ఈ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు అధికారులు, సిబ్బంది కలిసి పని చేయాలని అన్నారు.
త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం : నూతన చట్టం విధి విధానాల రూపకల్పనపై అధికారులు దృష్టి పెట్టాలని పొంగులేటి సూచనలు చేశారు. ‘ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, వీలైనంత త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. భూ భారతి చట్టం రూపకల్పనలో సహకరించిన సహచర మంత్రి వర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, శ్రమించిన అధికారులు, సిబ్బంది, సలహాలు అందించిన మేధావులందరికీ తెలంగాణ భూ యజమానుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన వెల్లడించారు.
ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి పోర్టల్ : రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ పట్టా పాసు పుస్తకాలు, భూ యాజమాన్య హక్కుల చట్టం(ఆర్వోఆర్)-2020 స్థానంలో భూ భారతి(ఆర్వోఆర్)-2025 అమల్లోకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై తేదీని ప్రకటించాల్సి ఉంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్రతో బిల్లు చట్ట రూపం దాల్చినా, విధి విధానాల రూపకల్పన అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆ రోజు నుంచే కొత్త చట్టంతో పాటు ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి పోర్టల్ అమల్లోకి వస్తుందని నిపుణులు అంటున్నారు.
భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదం - రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్న సీఎం
'ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు తెలుసుకునే పరిస్థితి లేదు - కానీ భూ భారతిలో వివరాలు అన్నీ ఉంచుతాం'