Trump Hush Money Case Updates : త్వరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పోర్న్ స్టార్‌కు హష్ మనీ వ్యవహారంలో ట్రంప్‌కు శిక్షను ఖరారు చేస్తామంటూ న్యూయార్క్ కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును ఆపలేమని అమెరికా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో హష్ మనీ కేసులో ట్రంప్‌నకు న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి జువాన్ ఎం.మెర్చన్ శిక్షను ప్రకటించేందుకు మార్గం సుగమం అయింది. దీంతో శిక్ష ఖరారయ్యాక వైట్ హౌస్‌లోకి అడుగుపెడుతున్న తొలి దేశాధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు.
నేడే శిక్ష ఖరారు
హష్ మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. వాస్తవానికి ఈ కేసులో 2024 సంవత్సరం నవంబరులోనే న్యూయార్క్ కోర్టు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. అయితే సరిగ్గా అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు క్రిమినల్ విచారణను ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ట్రంప్ ఆశ్రయించారు. గతంలో ఈ మేరకు ఇచ్చిన తీర్పుల ప్రాతిపదికన తనకు న్యూయార్క్ కోర్టు శిక్షను ఖరారు చేయకుండా ఆపాలంటూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఇందులో ట్రంప్‌నకు రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది. ట్రంప్‌నకు జనవరి 10న శిక్షను ఖరారు చేస్తానని ఇటీవలే న్యూయార్క్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అయితే దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనందున శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా డిశ్చార్జిని మంజూరు చేస్తానని ప్రకటించారు.
హష్ మనీ కేసు వివరాలివీ!
గతంలో శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో స్టార్మీ డానియల్స్‌కు రూ.1.11 కోట్లు (1.30 లక్షల డాలర్ల) హష్‌మనీని ట్రంప్ పంపారనే అభియోగాలు ఉన్నాయి. తన న్యాయవాది ద్వారా ఈ డబ్బును స్టార్మీ డానియల్స్‌కు ట్రంప్ అందజేశారని ఎఫ్ఐఆర్‌లో ఉంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన విరాళాల నుంచే ఆ డబ్బును స్టార్మీ డానియల్స్‌కు ట్రంప్ పంపారనే ఆరోపణ ఉంది. ఆ డబ్బు వ్యవహారాన్ని దాచేందుకు ఎన్నికల విరాళాల లెక్కలన్నీ తారుమారు చేశారనే అభియోగాన్ని ట్రంప్ ఎదుర్కొన్నారు. ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ కోర్టులో చెప్పారు. ఈ వ్యవహారంలో ట్రంప్ ఎదుర్కొన్న 34 అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన న్యూయార్క్ కోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో స్టార్మీ డానియల్స్ సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.