Tiffin Center Style Allam Pachadi Recipe : మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చట్నీ బాగుంటే మరో నాలుగు ఇడ్లీలు ఎక్కువ లాగించేస్తాం. దోశల్నీ ఓ పట్టుపడతాం. కానీ, చట్నీ తేడా కొట్టేస్తే సరిగా తినలేం. అలాంటి ఓ సూపర్ చట్నీని మీకోసం తీసుకొచ్చాం. అదే, నోరూరించే "అల్లం పచ్చడి". ఈ చట్నీ అన్ని రకాల టిఫెన్స్తోపాటు అన్నంలోకి చాలా బాగుంటుంది. అయితే, ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు కనుక ఈ ఒక్క సీక్రెట్ టిప్ ఫాలో అయ్యారంటే అల్లం చట్నీ పర్ఫెక్ట్గా కుదరడమే కాకుండా, టిఫెన్ సెంటర్ రుచికి ఏమాత్రం తీసిపోదు! అలాగే, వారం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి, ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- 75 గ్రాములు - అల్లం
- 200 గ్రాములు - పచ్చిమిర్చి
- 50 నుంచి 70 గ్రాములు - చింతపండు
- 100 గ్రాములు - బెల్లం
- 2 టేబుల్‌స్పూన్లు - ఆయిల్
- రుచికి సరిపడా - ఉప్పు
తాలింపు కోసం :
- 2 టేబుల్‌స్పూన్లు - ఆయిల్
- 1 టీస్పూన్ - ఆవాలు
- 1 టీస్పూన్ - జీలకర్ర
- 2 రెమ్మలు - కరివేపాకు
- మూడు - ఎండుమిర్చి
అసలైన "కొబ్బరి చట్నీ" చేసే పద్ధతి ఇదీ - వేళ్లు నాకేస్తారంతే!
తయరీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత అల్లం పొట్టు తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- పచ్చిమిర్చిని వేపుకోవడానికి వీలుగా నార్మల్ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- అల్లం పచ్చడి టిఫెన్ సెంటర్ స్టైల్లో రావాలంటే మీరు పాటించాల్సిన ఆ సీక్రెట్ టిప్ ఏంటంటే, మీరు తీసుకునే పచ్చిమిర్చి కారాన్ని బట్టి చట్నీలో వేసుకునే బెల్లం, చింతపండుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో దొరికే పచ్చిమిర్చిలన్నీ ఒకే రకం కారంతో ఉండవని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
- అవి వేగాక అందులో ముందుగా తురిమిపెట్టుకున్న సన్నని అల్లం ముక్కలు వేసి మరికాసేపు వేయించుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన పచ్చిమిర్చి మిశ్రమం, నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లంతో పాటు తగినన్ని మరిగించిన వేడి నీళ్లు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా వేడి నీరు పోసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంటే ఇది ఫ్రిడ్జ్‌లో ఉంచితే కనీసం వారం పాటు నిల్వ ఉంటుంది!
- ఇప్పుడు పచ్చడిలోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి తుంపలు వేసి పోపుని చక్కగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, నోరూరించే టిఫెన్ సెంటర్ స్టైల్ "అల్లం పచ్చడి" రెడీ!
ఇదొక్కటి వేసి "పల్లీ చట్నీ" చేయండి - టిఫెన్స్లోకి పర్ఫెక్ట్ టేస్ట్‌తో అదుర్స్ అనిపిస్తుంది!