Overspending On Credit Cards : మీరు క్రెడిట్ కార్డులతో అతిగా ఖర్చు చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. రివార్డ్స్, క్యాష్ బ్యాక్స్ కోసం మనలో చాలా మంది క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు. వాస్తవానికి దీని వెనుక ఒక సైకలాజికల్ ట్రిక్ ఉంది. దీని గురించి తెలుసుకోలేనివారు అతిగా ఖర్చులు చేస్తూ, చివరికి అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. అందుకే ఇలాంటి పరిస్థితి రాకుండా, ఈ ఆర్టికల్‌లో క్రెడిట్ కార్డ్ వినియోగం వెనుకున్న సైకాలజీ గురించి తెలుసుకుందాం.
సైకలాజికల్ ట్రిక్
క్రెడిట్ కార్డ్‌లను ఇష్యూ చేసే సంస్థలు వాటిపై అనేక రివార్డ్స్, క్యాష్‌బ్యాక్స్, ట్రావెల్ మైల్స్, డిస్కౌంట్స్ లాంటివి అందిస్తుంటాయి. ఇవి మత్తు పదార్థాల మాదిరిగా పనిచేస్తాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఉచితంగా రివార్డ్ పాయింట్లు వస్తాయనే ఆశను పుట్టిస్తాయి. దీనితో తెలియకుండానే చాలా మంది రివార్డ్ పాయింట్ల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కొన్ని సార్లు తమ శక్తికి మించి, అనవసర ఖర్చులు కూడా చేసేలా చేస్తుంటారు. రివార్డ్ పాయింట్స్ సంపాదించిన తరువాత విపరీతమైన ఆనందానికి లోనవుతారు. ఈ విధంగా తమకు తెలియకుండానే క్రమంగా రుణాల ఊబిలోకి జారుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే, రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ఖర్చులు చేసి, చివరికి రుణాలపాలు అవుతారు. అందుకే క్రెడిట్ కార్డ్‌లను చాలా బాధ్యతాయుతంగా వాడాల్సిన అవసరం ఉంటుంది.
అధిక ఖర్చులను తగ్గించుకోవడం ఎలా?
క్రెడిట్ కార్డ్ ఓవర్ స్పెండింగ్‌ను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- బడ్జెట్ : ముందుగానే మీకు సరిపడే బడ్జెట్‌ను వేసుకోవాలి. అవసరమైన వస్తు, సేవలను మాత్రమే కొనుగోలు చేయాలి. రివార్డ్ పాయింట్ల కోసం అధికంగా ఖర్చు చేయకూడదు. అవసరం లేని వాటిని రివార్డ్స్, క్యాష్‌బ్యాక్స్ కోసం కొనుగోలు చేయకూడదు.
- ఖర్చులను ట్రాక్ చేయాలి : మీరు చేసే ఖర్చులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏవైనా అనవసరపు ఖర్చులు ఉంటే, వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
- చిన్న చిన్న ఖర్చులు : వాస్తవానికి చిన్న చిన్న ఖర్చులే మనల్ని రుణాల ఊబిలోకి నెట్టేస్తాయి. కనుక చిన్న చిన్న ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవాలి.
- సేవింగ్ చేయాలి : చాలా మంది మంచి లాభదాయకమైన డీల్ కోసం అవసరంలేని వస్తువులు కొంటుంటారు. ఇలా చేయకూడదు. కేవలం మీకు దీర్ఘకాలంపాటు ఉపయోగపడే వస్తు, సేవలనే కొనుగోలు చేయాలి.
- క్రెడిట్ లిమిట్ మేరకు మాత్రమే : ప్రతి క్రెడిట్ కార్డ్‌కు ఒక లిమిట్ ఉంటుంది. దానిలో 30 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. అంతేకాదు సకాలంలో వాటిని తిరిగి చెల్లించాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. లేకుంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గే ప్రమాదం ఉంటుంది. పైగా భవిష్యత్‌లో మీకు రుణాలు లభించే అవకాశం బాగా తగ్గిపోతుంది.
- వడ్డీ రేట్లు : క్రెడిట్ కార్డ్ రుణాలపై వడ్డీ రేట్లు, పెనాల్టీలు, ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక సకాలంలో క్రెడిట్ కార్డ్ రుణాలు తీర్చేయాలి. అప్పుల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. పైగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. జర జాగ్రత్త!
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
విద్యార్థులకూ క్రెడిట్ కార్డ్‌లు- అర్హతలు, రుసుములు- దరఖాస్తు విధానం ఇదే!
క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం భారమవుతోందా? EMIలా మార్చుకుని సింపుల్‌గా చెల్లించండిలా!