రామయ్యకు 108 అడుగుల బాహుబలి అగరబత్తి.. ఆలయమంతా సువాసనే! - pancha dravya incense stick
🎬 Watch Now: Feature Video
గుజరాత్.. వడోదరాలోని తర్సాలీకి చెందిన కొందరు భక్తులు.. అయోధ్య రామమందిరం కోసం బాహుబలి అగరబత్తిని తయారుచేశారు. 108 అడుగుల పొడవు.. 3403 కిలోల బరువున్న అగరబత్తిని తయారు చేసి శ్రీరాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. విహాభాయ్ భర్వాడ్ నేతృత్వంలో ఈ అగరబత్తిని పంచద్రవ్యాలతో తయారు చేశారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ బాహుబలి అగరబత్తిని అయోధ్యకు పంపాలని ప్లాన్ చేస్తున్నారు తర్సాలీకి చెందిన భక్తులు. బాహుబలి అగర్బత్తి తయారీకి దాదాపు 2 నెలల సమయం పట్టిందని విహాభాయ్ భర్వాడ్ తెలిపారు. ఈ అగర్బత్తి భారీ సువాసన వెదజల్లుతుందని.. దీని తయారీ కోసం పంచద్రవ్యాలు వాడామని ఆయన చెప్పారు.
'ఈ ఏడాది డిసెంబరుకల్లా అగరబత్తిని ఊరేగింపుగా అయోధ్యకు తరలిస్తాం. అక్కడ భక్తుల సమక్షంలో అగర్బత్తిని వెలిగిస్తాం. పంచ ద్రవ్యాలతో బాహుబలి అగర్బత్తిని తయారుచేశాం. ఈ అగర్బత్తిని 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల చుట్టుకొలతతో తయారుచేశాం. 191 కిలోల ఆవు నెయ్యి, 376 కిలోల గుగ్గిలం పొడి, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొబ్బరి పొడి, 425 కిలోల పూర్ణాహుతి సామగ్రి, 1,475 కిలోల ఆవు పేడను వాడాం. ఈ అగరబత్తి తయారీకి దాదాపుగా రూ.5లక్షలు ఖర్చయ్యింది. అయోధ్యకు అగరబత్తిని తరలించడానికి రూ. 4.5 లక్షలు ఖర్చవుతుంది. అయోధ్యలో జరిగే కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను ఆహ్వానిస్తాం' అని తర్సాలీ వాసి విహాభాయ్ భర్వాడ్ తెలిపారు.