Bahubali Scene at Asifabad : వాగు ఉప్పొంగింది.. బాహుబలి దృశ్యం రిపీట్ అయింది
🎬 Watch Now: Feature Video
Bahubali Scene Repeat in Kumurambheem Asifabad : వానొచ్చిందంటే... వాగొస్తుంది. వాగు ఉప్పొంగిందంటే... అక్కడ ఇక బాహుబలి సినిమానే కనిపిస్తుంది. చిన్నారి బాహుబలిని రాజమాత రక్షించిన తరహా దృశ్యాలు... లేదంటే శివగామిలా వాగులో కొట్టుకుపోయిన సంఘటనలు. బాహుబలి సినిమాలో ఈ సీన్‌ను తెరపై మనం ఏడెనిమిదేళ్ల క్రితం మాత్రమే చూశాం.... కానీ.., ఈ తరహా ఘటనలు ఎన్నో ఏళ్లుగా ఏటా అక్కడ కళ్ల ముందు జరుగుతూనే ఉంటాయి. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కొమురంభీం జిల్లా పెన్‌గంగా, ప్రాణహిత నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా... అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. ఈ తరుణంలోనే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం మారుమూల అటవీ ప్రాంతమైన లక్మాపూర్‌కు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రమాదమని తెలిసినా తప్పని స్థితిలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చిన్నారిని పైకెత్తి... అతికష్టం మీద వాగు దాటాడు. ఈ దృశ్యం బాహుబలి సినిమాలోని శివగామి ఏ విధంగా అయితే పిల్లాడిని రక్షించిందో ఆ తరహా సీన్ నిజజీవితంలో ఇక్కడ చోటుచేసుకుంది. వర్షాకాలంలో ఊరి బయటికి వెళ్లాలంటే అక్కడ పసిపిల్లల నుంచి పండుముదుసలి వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగును దాటాల్సిన పరిస్థితి నెలకొంది.