Boy Died in Anganwadi Center: తాడే తనువు తీసింది.. అంగన్వాడీ కేంద్రంలో విషాదం - boy died at anganwadi center
🎬 Watch Now: Feature Video
Boy Died in Anganwadi Center: ఆడుకుందామని వెళ్లిన బాలుడు.. అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చెల్లిని తీసుకొని అంగన్వాడీకి వెళ్లిన ఆ బాలుడు.. అక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రంలో తూకం వేసే తాడు మెడకు చుట్టుకుని ఓ బాలుడు మృతి చెందాడు. 11 ఏళ్ల మనోజ్ చంద్రశేఖర్ తన చెల్లిని అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చాడు. అదే సమయంలో అంగన్వాడీ టీచర్ సెలవులో ఉండగా.. సహాయకురాలు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్లారు. పర్యవేక్షకులు ఎవరూ లేని సమయంలో అంగన్వాడీ కేంద్రంలో ఉన్న బరువు చూసే తాడుతో ఆడుకునేందుకు వెళ్లి.. అందులో తలదూర్చాడు. దీంతో ఆ తాడు మెడకు బిగుసుకుపోవడంతో.. ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గొల్లపాలెం వెళ్లి.. బాలుడి తల్లిదండ్రులు, బంధువుల్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.