నిబంధనలు గాలికి.. గుంపులుగా జనం బారులు - ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాటించని నిబంధనలు
మే29 వరకు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా.. ప్రజలు మాత్రం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చే వాళ్లు కనీసం మాస్కు కూడా ధరించడం లేదు. ఇక భౌతిక దూరం పాటించడంలోనూ అటు దుకాణ దారులు, వినియోగదారులు నిబంధనలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా రద్దీ అధికంగా ఉండే బ్యాంకులు, పోస్టాఫీసులు, కార్యాలయాలు, దుకాణాల్లో భౌతికదూరం పాటించకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించడంలేదు. అత్యధిక కేసులున్న జోగులాంబ గద్వాల జిల్లాలో మినహా మిగిలిన 4 జిల్లాల్లో దాదాపుగా అన్ని దుకాణాలు తెరిచారు. పట్టణాల్లోనూ 50 శాతం షాపులు తెరవాలన్న నిబంధన అమలు కావడం లేదు. దుకాణాల ముందు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌లు కనిపించడం లేదు.
వనపర్తిలో మాస్కులు ధరించని సుమారు 100 మందికి పోలీసులు, మున్సిపల్ అధికారులు రూ. వెయ్యి జరిమానా విధించారు. అయితే మిగిలిన మున్సిపాలిటీల్లో మాత్రం ఆ దిశగా చర్యలు లేవు. తూతూ మంత్రంగా ఫైన్లు వేసి వదిలేస్తున్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా పాటిజివ్ కేసు నమోదు కాక పోగా.. నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో 14 రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు.
జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 45 కేసులు నమోదవగా.. ఇప్పటి వరకూ 40 మంది కోలుకున్నారు. ఒకరు మరణించారు. నాలుగు మాత్రమే ఆక్టివ్ కేసులున్నాయి. వీరు సైతం కోలుకుంటే అక్టివ్ కేసులు లేని జిల్లాగా ఉమ్మడి పాలమూరు మారనుంది. ఇక ఈ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు వందల సంఖ్యలో ప్రస్తుతం సొంత జిల్లాలకు తిరిగి వస్తున్నారు. వచ్చిన వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ ముద్ర వేసి.. హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు అధికారులు.
ఇదీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?