Brijesh Kumar Tribunal Verdict on Krishna Water : కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంది.
పునర్విభజన చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై మొదట వాదనలు వింటామని తెలిపింది. ముందుగా 811 టీఎంసీల్లో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటాను ముందే తేల్చాల్సిన అవసరం ఉందని ట్రైబ్యునల్ పేర్కొంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు ఇరు రాష్ట్రాల వాదనలు వింటామని తెలిపింది. ఆ తర్వాతే 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తేలుస్తామని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.
"బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోంది. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుంది. బచావత్ ట్రైబ్యునల్ ఎన్ బ్లాక్‌గా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుంది" - ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదలశాఖ మంత్రి