Massive Road Accident in Shirdi Tour : మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన శమిషెట్టి కృష్ణమూర్తి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.
మొక్కు తీర్చుకోవడానికి వెళ్లి : సోమవారం తన కుమార్తె, కుమారుడుతో పాటుగా కుటుంబ సభ్యులందరు 14 మందితో కలిసి మొక్కు తీర్చుకునేందుకు మహారాష్ట్రలోని శిరిడీకి సోమవారం (జనవరి 13) రాత్రి వెళ్లారు. మంగళవారం శిరిడీలో సాయిబాబా దర్శనం అనంతరం చుట్టు పక్కల దేవాలయాలను దర్శించుకునేందుకు అక్కడే ఓ తుఫాన్ వాహనాన్ని అద్దెకు తీసుకొని బయలుదేరారు.
ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీ : నాసిక్ వెళ్లే క్రమంలో శిరిడీ, ఔరంగాబాద్ మధ్యలో రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఎదురుగా ఉన్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి ముందు వెళుతున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీ కొనడంతో కొండగడపకు చెందిన శామిషెట్టి ప్రేమలత (55), కుమార్తె తొలుపునూరి ప్రసన్న (42), ఆమె కుమారుడు తొలుపునూరి అక్షిత్(20)తో పాటు కృష్ణమూర్తి మనవడు 6 నెలల శమిషెట్టి వైద్విత్ అక్కడికక్కడే మృతి చెందారు.
గ్రామంలో విషాద ఛాయలు : మృతదేహాలను స్థానికంగా అక్కడే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ కృష్ణమూర్తి, ఆయన కుమారుడు వెంకన్న, అల్లుడు శ్రీనివాస్, కూతురి కుమార్తె శరణ్య ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మృత్యువాత పడడంతో కొండగడప గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శమిషెట్టి కృష్ణమూర్తి వ్యాపార రీత్యా గత 12 ఏళ్లుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు - ఐదుగురు కూలీల దుర్మరణం
ఊరెళ్లిన అమ్మానాన్నల కోసం పిల్లల ఎదురుచూపులు - కాసేపట్లో ఇంటికి చేరతారనగా!