Jageshwar Kuber Mandir History In Telugu : ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవకపోవడం, ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలు, ఋణ బాధలతో ఇబ్బంది పడేవారు ఒక్కసారి జాగేశ్వర్ కుబేర మందిరాన్ని దర్శిస్తే ఇక జీవితంలో ఆర్థిక బాధలు ఉండనే ఉండవంట! ఇంతకు ఈ ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒక్కసారి దర్శిస్తే పేదరికం పరార్!
అతి ప్రాచీన ఆలయాలకు పుట్టినిల్లు భారతదేశం. ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంది. అతి ప్రాచీనమైన ఈ కుబేర ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే జీవితంలో ధనానికి లోటుండదని అంటారు. దేవభూమి ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ కుబేర ఆలయాన్ని జాగేశ్వర్ ధామ్ అని పిలుస్తారు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకోడానికి ప్రతి రోజు భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. జాగేశ్వర్ ధామ్ కాంప్లెక్స్‌లో ఉన్న 125 ఆలయ సమూహాలలో కుబేరుని ఆలయం ఒకటి. దాదాపు 9వ శతాబ్దానికి చెందినదిగా భావించే ఈ ఆలయం భారతదేశంలోని ఎనిమిదో కుబేర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.
బంగారు వెండి నాణేలు సమర్పణ
కుబేర ఆలయంలో భక్తులు బంగారు, వెండి నాణేలు తెచ్చి, కుబేరుని దర్శించుకునే సమయంలో వాటిని పూజించి అనంతరం ఒక పసుపు వస్త్రంలో ఆ నాణేలను కట్టి ఇంటికి తీసుకువెళతారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తీరతాయని విశ్వాసం. ఈ ఆలయానికి వెళ్లడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు మళ్లీ ఆలయానికి వెళ్లి కుబేరుడికి బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
దర్శన ఫలం
జాగేశ్వర్ కుబేర మందిరాన్ని ఒక్కసారి దర్శిస్తే కుబేరుని ఆశీర్వాదంతో పేదరికం నుంచి విముక్తి పొంది, సంపద, కీర్తి లభిస్తాయని విశ్వాసం.
ఎలా చేరుకోవాలి?
దేశ రాజధాని దిల్లీ నుంచి కత్గోడం వరకు రైలులో ప్రయాణించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. భిన్నమైన సంప్రదాయాలతో ఆకట్టుకునే ఈ ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం సిరిసంపదలను పొందుదాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.