శనగ రైతు ఆవేదన: పంట కొన్నారు.. పైసలివ్వడం మరిచారు..! - తెలంగాణ వార్తలు
పంట పండించారు. అధికంగా డబ్బులొస్తాయని ప్రభుత్వానికి విక్రయించారు. తీరా డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియక దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పప్పు శనగ రైతులు. పంటను కొనుగోలు చేసి నెల రోజులు దాటుతున్నా.. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. సుమారు రూ.4 కోట్ల వరకు కర్షకులకు చెల్లించాల్సి ఉండగా.. ఆ డబ్బులకు ఎప్పుడు మోక్షం లభిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అన్నదాతలు.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ అధికారుల అలసత్వం, అవగాహన లోపంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పప్పు శనగ అమ్మి నెలరోజులవుతున్నా.. ఇప్పటికీ డబ్బులు రాకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ద్వారా పప్పు శనగలను కొనుగోలు చేశారు. డబ్బులు త్వరగా వస్తాయని రైతులు భావించారు. ఇందుకు భిన్నంగా నెల రోజులు గడుస్తున్నా.. డబ్బులు రాకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం రూ.5 వేలకు కొనుగోలు చేస్తుండగా.. దళారులు సైతం రూ.4,800 నుంచి రూ.5,000 చెల్లిస్తున్నారు. దీంతో దళారులకు అమ్ముకున్నా.. తమకు ఇప్పటివరకు డబ్బులొచ్చేవని అన్నదాతలు వాపోతున్నారు.
రూ.4 కోట్ల మేర బకాయిలు..
అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో మార్చి నెల 30వ తేదీ నుంచి పప్పు శనగ కొనుగోలు చేశారు. నెల రోజులు గడిచిపోతున్నా రైతన్నల ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ కాలేదు. సుమారు రూ.4 కోట్ల మేర డబ్బులు అన్నదాతలకు చెల్లించాల్సి ఉంది.
అవగాహన లోపంతో అవస్థలు..
పంట కొనుగోళ్లకు ఈసారి కొత్తగా క్కూ ఆర్ కోడ్ ప్రవేశపెట్టారు. ఫలితంగా మార్కెట్ యార్డు అధికారులు, సిబ్బందికి అవగాహన లేకపోవడంతో ఈ విధానంతో చాలా ఇబ్బందులుపడ్డారు. ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పంట కొనుగోలు చేసి దాదాపు 45 రోజులు అవుతున్నా.. అధికారులు ఇప్పటికీ వివరాలను ప్రభుత్వానికి పంపకపోవడం వల్ల రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీనిపై అధికారులను వివరణ కోరగా.. స్పందించకపోవడం గమనార్హం.