బబుల్ నిబంధనలు అతిక్రమణ.. అంపైర్‌పై నిషేధం - మైఖేల్ గాఫ్ బయోబబుల్ అతిక్రమణ
టీ20 ప్రపంచకప్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మైఖేల్ గాఫ్‌పై నిషేధం విధించింది ఐసీసీ. కరోనా నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

టీ20 ప్రపంచకప్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇంగ్లీష్ అంపైర్ మైఖేల్ గాఫ్‌పై ఆరు రోజుల నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడిపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం హోటల్లో క్వారంటైన్లో ఇతడికి రోజు తప్పించి రోజు కరోనా టెస్టు చేయనున్నారు. ఆరు రోజుల క్వారంటైన్లో పరీక్షల్లో నెగిటివ్ తేలితే గాఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టే వీలుంది.
ఏం జరిగింది?
ప్రస్తుతం బయోబబుల్‌లో ఉన్న అంపైర్ గాఫ్.. అనుమతి లేకుండా హోటల్‌ను వీడి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. బబుల్ బయట ఉన్న వ్యక్తుల్ని కలవడం ద్వారా ఐసీసీ అతడిపై చర్యలు తీసుకుంది.
ఆదివారం జరిగిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు గాఫ్.. అంపైర్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల అతడికి బదులు మరైస్ ఎరాస్మస్ను తీసుకుంది ఐసీసీ.