'టోక్యో ఒలింపిక్స్'కు ఇంకా 365 రోజులే - Tokyo Olympics news
కరోనాతో వాయిదాపడ్డ ఒలింపిక్స్ మొదలయ్యేందుకు సరిగ్గా ఏడాది సమయముంది. ఈ సందర్భంగా గురువారం, టోక్యో జాతీయ స్టేడియంలో ప్రేక్షకులు ఎవరూ లేకుండా 15 నిమిషాల ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.
కరోనానే లేకుంటే ఈ పాటికే అథ్లెట్లు, అభిమానులతో టోక్యో కళకళలాడేది. ప్రపంచమంతా ఒలింపిక్స్ జోష్‌తో ఉరకలేసేది. కానీ మహమ్మారి విశ్వసంబరాన్ని బలితీసుకుంది. ఈ నెల 24న ఆరంభం కావాల్సిన క్రీడల్ని 2021కు వాయిదా వేయక తప్పలేదు. కరోనా శాంతిస్తే, అంతా సవ్యంగా సాగితే సరిగ్గా వచ్చే ఏడాది ఇదే రోజు (జులై 23, 2021) ఒలింపిక్స్ (టోక్యో 2020) మొదలు కానున్నాయి. క్రీడల నిర్వహణపై అనుమానాలు, భయాలు అలాగే ఉన్నా.. అనిశ్చితి కొనసాగుతున్నా సగటు క్రీడాభిమాని మాత్రం ఆశాభావంతోనే ఉన్నాడు. చూద్దాం.. 2021 ఎలా ఉండబోతోందో!
ఇలాగే కొనసాగితే ఒలింపిక్స్ నిర్వహించలేం:
కరోనా మహమ్మారి తీవ్రత ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించలేమని క్రీడల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి చెప్పారు. టీకా వస్తే పరిస్థితి మెరుగవ్వొచ్చని యోషిరో ఆశాభావం వ్యక్తంజేశారు. 2021లో ఒలింపిక్స్ ఆరంభానికి సరిగ్గా ఏడాది సమయం ఉండటం వల్ల జాతీయ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా గురువారం 15 నిమిషాల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
"కరోనా తీవ్రత ఇలాగే కొనసాగితే ఒలింపిక్స్ నిర్వహించలేం. అయితే ఈ పరిస్థితి మరో ఏడాది పాటు కొనసాగుతుందని అనుకోవట్లేదు. ఒలింపిక్స్ జరుగుతాయా? లేదా? అన్నది కరోనాను మానవ జాతి ఓడిస్తుందా? లేదా? అన్న దానిపై ఆధారపడి ఉంది. వీలైనంత త్వరగా టీకా లేదా ఔషధం తయారు చేయడం ముఖ్యం" అని యోషిరో అన్నారు.