చెలరేగిన చాహల్, నటరాజన్.. మొదటి టీ20లో భారత్ విజయం - భారత్-ఆస్ట్రేలియా మొదటి టీ20
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. 11 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌ను గెలుపుతో ప్రారంభించింది టీమ్ఇండియా. కాన్బెర్రా మనుకా ఓవల్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించింది. 11 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రాహుల్ (51), జడేజా (44) ఆకట్టుకోవడం వల్ల తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు సాధించింది.
అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు షార్ట్ (34), ఫించ్ (35) చెలరేగి ఆడారు. దీంతో 7.4 ఓవర్లలో 56 పరుగులతో గెలుపు దిశగా పయనించింది. కానీ చాహల్ మూడు వికెట్లతో ఆసీస్ వెన్నువిరిచాడు. ఫించ్, స్మిత్ (12), వేడ్ (7) వికెట్లను దక్కించుకున్నాడు. నటరాజన్ కూడా మూడు వికెట్లతో మెరుగైన ప్రదర్శన చేయడం వల్ల ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులకు పరిమితమై ఓటమి మూటగట్టుకుంది.