దీపం జ్ఞానానికి ప్రతీక. వెలుగుతున్న వత్తి పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అంధకారాన్ని పోగొడుతుంది. అంధకారమంటే బయట ఉండే చీకటి మాత్రమే కాదు. మనలో ఉంటే అజ్ఞానం కూడా అంధకారమే. అలాంటి అంధకారాన్ని దీపం పోగొడుతుంది. దీపారాధన ద్వారా మనలో దాగి ఉన్న దైవీకమైన చైతన్యం ఉత్తేజితమవుతుంది.
అగ్నిసాక్షిగా పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న భావన దీపారాధనతో కలుగుతుంది. దీపాలను వెలిగించడమంటే మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞానకాంతిని ఆహ్వానించడమే దీపంలో కనిపించే నీలం, పసుపు, తెలుపు వర్ణాలు మనలోని సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలు. సత్యం, శివం, సుందరాలకు సంకేతాలవి. సృష్టిని చైతన్యవంతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతి నుంచే ప్రభవిస్తాయి.
భగవంతుడికి చేసే షోడశోపచారాల్లో దీప సమర్పణ ప్రధానమైంది. దీపం వేడిని భూమాత భరించలేదని ప్రమిదలో ప్రమిద వేసి మరీ దీపం వెలిగిస్తారు కొందరు. మూడు వత్తులతో దీపారాధన చేయాలి. పంచభూతాత్మకమైన సృష్టికి దీపం ప్రతీకగా నిలుస్తుంది. మట్టి ప్రమిద భూ తత్త్వానికి, తైలం జలతత్త్వానికి, వత్తి ఆకాశ తత్త్వానికి, దీపం వెలగటానికి ఉపయోగించే గాలి వాయుతత్త్వానికి ప్రతీకలు. మనిషి శరీరం కూడా పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించటమంటే మనల్ని మనమే వెలిగించుకోవటం అవుతుంది. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషి కూడా తనకు తానుగా జ్ఞాని కాలేదు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలి. దీపారాధన వెనకున్న అంతరార్థం ఇదే.