గత ఏడాది డిసెంబరు ఆఖరున ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా అధికారుల నుంచి ఓ నివేదిక అందింది. అంతుచిక్కని న్యుమోనియాతో వుహాన్‌లో పదుల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారన్నది దాని సారాంశం. అలా మొదలైన మహమ్మారి వాయువేగంతో ప్రపంచాన్ని చుట్టేసింది. ఎంతలా అంటే.. ప్రజల జీవితాల్లో ఊహించనంత కల్లోలం రేపేలా. ఎన్నో దేశాల్లో మనిషి జీవితమే మారిపోయింది. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. కోట్ల మంది విద్యార్థులు నెలల తరబడి ఇళ్లకే పరిమితమైపోయారు.
కేసుల సునామీ..
'సార్స్-కోవ్-2'గా పిలిచే ఈ కొత్త కరోనా వైరస్‌తో ఇంతవరకు కోటీ 6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 5.15 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఒక్క అమెరికాలోనే 27 లక్షల మంది దీనిబారిన పడ్డారు.
నాడు.. నేడు
వైరస్ ఆనుపానులను తెలుసుకోవడానికి ఇంతకు ముందెన్నడూ లేనంతా శాస్త్రవేత్తలు అహరహం శ్రమిస్తున్నారు. ప్రారంభంలో వేసిన ఎన్నో అంచనాలు తల్లకిందులయ్యాయి. అవేమిటో చూద్దాం..
వాయువేగంతో వ్యాప్తి
- మహమ్మారి ఉనికి బయటపడిన తొలినాళ్లలో ఇది సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదని చైనా అధికారులు భావించారు. సార్స్, మెర్స్‌లకు కారణమైన కరోనా వైరస్‌లు ఊపరితిత్తుల్లోపల ప్రభావం చూపడంతో కొత్త వైరస్ కూడా అలాగే ప్రవర్తిస్తుందని అంచనా వేశారు. దీంతో దగ్గు వంటి లక్షణాలున్న వారి నుంచే ఇది ఇతరులకు సోకుతుందని భావించారు.
- మూడు వారాలకే మహమ్మారి వ్యాప్తి తీవ్రత బోధపడింది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా, సులువుగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. సార్స్, మెర్స్‌లాగా కాకుండా లక్షణాలు కనిపించని వారి నుంచి కూడా ఇతరులకు వైరస్ సోకుతున్నట్లు తేలింది.
- సార్స్-కోవ్-2 ఊపిరితిత్తుల కణాలతో పాటు, ముక్కులోని కణాలనూ ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. దీంతో దగ్గడం, తుమ్మడం వంటి సమయాల్లో వెలువడే తుంపర్లే కాకుండా చివరకు మాట్లాడటం, శ్వాస సమయాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.
అంతుచిక్కని ప్రశ్నలు
కొత్త వైరస్‌పై ఇప్పటికీ స్పష్టత లేని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అవి..
- సార్స్, మెర్స్‌ల కంటే కొత్త వైరస్ సంక్రమణ తీవ్రత ఎందుకు ఎక్కువగా ఉంది?
- లక్షణాలు బయటపడని వ్యక్తులు తరచూ ఎలా వ్యాప్తికి కారణమవుతున్నారు?
- కొందరే ఎందుకు తీవ్రంగా అనారోగ్యం బారిన పడుతున్నారు?
- కొందరు రోగులు కోలుకున్న తర్వాత కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఎందుకు ఎదుర్కొంటున్నారు?
- యాంటీబాడీలు తయారై కోలుకున్న వ్యక్తుల్లో ఆ రోగనిరోధక శక్తి ఎంతవరకు ఉంటుంది?
- పూర్వస్థితిలో మాదిరిగా విద్యాసంస్థలు, వ్యాపారాలను సురక్షిత వాతావరణంలో పునఃప్రారంభించడం ఎప్పుడు? ఎలా?
- లక్షణాలెన్నో..
- అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తొలినాళ్లలో.. జ్వరం, శ్వాస అందకపోవడం, దగ్గును లక్షణాలుగా పేర్కొంది.
- సీడీసీ ఇప్పుడు కొవిడ్-19కు ఏకంగా 11 లక్షణాలను చెబుతోంది. జ్వరం లేదా చలి; దగ్గు; ఊపిరి అందకపోవడం; తీవ్ర అలసట; కండరాలు లేదా ఒళ్లునొప్పులు; తలనొప్పి; రుచి, వాసన తెలియకపోవడం; గొంతు మంట; ముక్కు కారడం; వాంతులు; విరేచనాలు.. ఇవన్నీ లక్షణాలేనని చెబుతోంది. అయితే శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, ఒత్తిడిగా అనిపించడం; ఆందోళనకు లోనుకావడం, లేవలేకపోవడం, పెదాలు, ముఖం పాలిపోవడం వంటి లక్షణాలను అత్యవసర పరిస్థితిగా భావించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎక్కువ ముప్పు ఎవరికి?
- 65 ఏళ్లు దాటిన వారిలో కొవిడ్ తీవ్రమై ముప్పు ఎక్కువగా ఉంటుందని మొదట్లో భావించారు. పిల్లలకు అంతగా సోకదనీ అంచనాకు వచ్చారు.
- వయోధికులకు ముప్పు ఎక్కువ ఉంటుందన్నది కొంత వాస్తవమైనా అన్ని వయసుల వారికీ కొవిడ్ సోకుతోంది. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిలో పరిస్థితి దుర్బలంగా ఉంటోంది. ఇతర వయసుల వారితో పోలిస్తే పిల్లల్లో సంక్రమణ తీవ్రత తక్కువగా ఉంటున్నప్పటికీ శాస్త్రవేత్తలు దీన్ని రూఢీగా చెప్పడం లేదు. అమెరికాతో పాటు, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొందరు పిల్లలు కొవిడ్‌తో సంబంధం ఉన్న ప్రమాదకర వాపు వ్యాధి బారిన పడుతున్నారు.
ఒకరి నుంచి మరొకరికి..
- కొవిడ్ సోకిన ఒక వ్యక్తి సగటున ఇద్దరు లేదా ముగ్గురికి వ్యాప్తి చెందించే అవకాశం ఉందని అప్పట్లో అంచనాకొచ్చారు.
- భౌతిక దూరాన్ని పక్కాగా పాటించడం, కేసులను త్వరగా గుర్తించడం వంటి చర్యల ఫలితంగా చైనా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. భారత్, లాటిన్ అమెరికా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఎక్కువగా గుమిగూడటం, నిబంధనలను పాటించకపోవడం వంటి కారణాలతో కేసులు పెరుగుతున్నాయి.
అందరికీ మాస్కులు..
- అనారోగ్యానికి గురైనవారు మాత్రమే మాస్కులు ధరిస్తే సరిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, సీడీసీలు గతంలో చెప్పాయి.
- లక్షణాలు బయటపడని వారి నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పుడు అందరూ తప్పక మాస్కులు ధరించాలని ఈ రెండు ప్రఖ్యాత సంస్థలతో పాటు నిపుణులంతా సూచిస్తున్నారు. వస్త్రంతో చేసిన మాస్కులపై అప్పట్లో సందేహాలున్నా.. అవి కూడా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు ఎన్నో అధ్యయనాల ద్వారా తేలింది.
ఆ రెండే కీలకం..
కరోనా ఇప్పట్లో వదిలే పరిస్థితి లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహమ్మారి పీడ విరగడ అవ్వాలంటే దీనికి హెర్డ్ ఇమ్యూనిటీ (సామూహిక రోగనిరోధక శక్తి) రావాలి. అంటే జనాభాలో కనీసం మూడింట రెండొంతుల మందిలో దీనికి రోగనిరోధకశక్తి ఉండాలి. దీనిబారిన పడి కోలుకోవడం లేదా టీకాల ద్వారా ఆ శక్తిని పొందడం జరగాలి. అయితే ఈ రెండూ ఎప్పుడు సాధ్యమనేది చెప్పడం కష్టమే. ఈ ఏడాది ఆఖరుకు టీకా వచ్చే అవకాశం ఉందన్న వార్తలు మాత్రం ఆశలు రేకెత్తిస్తున్నాయి. దీనికైనా మరో 6 నెలలు ఆగాల్సిందే. ఈలోపు పరిశోధకులు వైరస్ గురించి మరెన్నో కొత్త అంశాలను కనుగొంటారు. దీంతో వైరస్ 'సునామీ' తగ్గుముఖం పడుతుందని ఆశిద్దాం.
ఇదీ చూడండి:సరిహద్దు వివాదంపై చర్చల్లో పురోగతిని స్వాగతించిన చైనా