India US 500 Billion Dollor Trade Target : కీలక రంగాల్లో భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చే విధంగా ఇరు దేశాధినేతల భేటీలో ముందడుగుపడింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏడాదికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని రెండు దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అమెరికా నుంచి ఇంధనం, సహజవాయువును భారత్ మరింతగా దిగుమతి చేసుకోనుంది.
సమీప భవిష్యత్తులో పెద్ద వాణిజ్య ఒప్పందాలను భారత్-అమెరికా కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఐదోతరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు F-35లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వీటితో పాటు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఉత్పత్తులను భారత్‌కు అమెరికా విక్రయించనుంది. కీలక ఆయుధాలను భారత్‌తో కలిసి ఉత్పత్తి చేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది. అదనంగా ఆరు పీ-8ఐ సముద్ర గస్తీ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన సహా భారత రక్షణ అవసరాలను తీర్చడానికి జావెలిన్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, 'స్ట్రైకర్' పదాతిదళ పోరాట వాహనాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. రాబోయే దశాబ్దానికి రక్షణ సహకార ముసాయిదా తయారీకి ఇరుదేశాలు సిద్ధమయ్యాయి.
![India US 500 Billion Dollor Trade Target](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23543178_m1-2.jpg)
తహవూర్ రాణాను భారత్‌కు అప్పగింత
భారత్ ఎన్నాళ్ల నుంచో డిమాండ్ చేస్తున్న ముంబయిపై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భారత్, అమెరికా మునుపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. అయితే సుంకాల విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గలేదు. భారత్ లేదా మరే దేశమైనా సరే తమపై తక్కువ పన్నులు విధిస్తే తాము కూడా అలానే టారిఫ్‌లు వేస్తామని, భారత్ తమపై ఎంత శాతం పన్ను విధిస్తే తాము అంతే ఛార్జి చేస్తామని స్పష్టం చేశారు. మోదీనే తనకంటే చాలా మెరుగ్గా బేరసారాలు ఆడగలరని, అందులో ఎలాంటి అనుమానం లేదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
![India US 500 Billion Dollor Trade Target](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23543178_m1-3.jpg)
"ప్రపంచంలో అమెరికా ఉత్పత్తులపై అందరి కంటే భారత్ ఎక్కువగా సుంకాలు విధిస్తోంది. సుంకాల విషయంలో భారత్ చాలా కఠినంగా ఉంటుంది. నేను దాన్ని తప్పుబట్టను. వ్యాపారం చేయడంలో అదో భిన్నమైన మార్గం. భారత్‌లో అమ్మడం చాలా కష్టం ఎందుకంటే అక్కడ వాణిజ్య అడ్డంకులు, అధిక సుంకాలు ఉన్నాయి. అమెరికా ఇప్పుడు ప్రతీకార సుంకాలు విధించే దేశంగా ఉంది. భారత్ లేదా మరే దేశమైనా అమెరికా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తే మేము కూడా తక్కువ టారిఫ్‌లు విధిస్తాం. భారత్ ఎంత సుంకం విధిస్తే మేము కూడా అంతే పన్ను విధిస్తాం. ఏ దేశమైనా మాపై ఎంత సుంకాలు విధిస్తుందో మేము కూడా అంతే టారిఫ్ వేస్తాం. అదే సరైన పద్ధతి అని నేను అనుకుంటున్నాను."
--డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అక్రమ వలసదారులకు అక్కడ నివసించే హక్కు లేదు! : మోదీ
ట్రంప్‌తో చర్చలు తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం మధ్య ప్రత్యేక బంధం ఉందన్నారు. ఇంధనం, కీలక సాంకేతికతలు, కనెక్టివిటీ వంటి విభిన్న రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని భారత్-అమెరికా నిర్ణయించినట్లు తెలిపారు. అక్రమ వలసదారుల అంశంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
![India US 500 Billion Dollor Trade Target](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23543178_m1-4.jpg)
"ఏ దేశంలోకి అయినా అక్రమంగా ఎవరైనా ప్రవేశిస్తే వారు అక్కడ నివశించడానికి ఎలాంటి హక్కు ఉండదు. ఇక భారత్, అమెరికా విషయానికి వస్తే మా అభిప్రాయం ఎప్పుడూ ఒక్కటే. భారత్‌కు చెందిన వ్యక్తి అమెరికాలో ఉంటున్నట్లు నిరూపణ అయితే వారికి వెనక్కి తీసుకోవడానికి మేము సిద్ధం. ఐతే ఈ విషయం అక్కడితో ఆగిపోదు. వీరంతా సామాన్య కుటుంబాలకు చెందినవారు. వారికి పెద్ద పెద్ద ఆశలు చూపించి తీసుకుని వెళ్తున్నారు. వారిలో చాలా మందిని ఒక దేశానికి ఎందుకు వెళ్తున్నారో తెలియకుండానే తీసుకువస్తున్నారు. వాస్తవానికి, ఇది మానవ అక్రమ రవాణా వ్యవస్థతో సంబంధం కలిగిన విషయం. మనం మానవ అక్రమ రవాణా వ్యవస్థపై మనం పోరాడాలి."
--ప్రధాని నరేంద్ర మోదీ
మోదీ నా స్నేహితుడు : ట్రంప్
ప్రతిష్టాత్మకమైన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్‌పై మాట్లాడిన ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో గొప్ప వాణిజ్య మార్గాలలో ఒకదానిని నిర్మించడంలో సహాయం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని అన్నారు. అమెరికా అణు సాంకేతికతలను భారత మార్కెట్‌లోకి ఆహ్వానించడానికి భారత్ తన చట్టాల్లో సంస్కరణలు తెస్తోందని ట్రంప్ అన్నారు. చాలాకాలం నుంచి ప్రధాని మోదీ తనకు గొప్ప స్నేహితుడని తెలిపారు.
![India US 500 Billion Dollor Trade Target](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23543178_m1-1.jpg)
'ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు - ట్రంప్‌నకు నా మద్దతు ఉంటుంది'
ట్రంప్ రెండో విడత పాలనలో మరింత వేగంగా ఇరుదేశాలు పని చేస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్‌నకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని, ఆయనలానే తాను కూడా భారత ప్రయోజనాలకే మిగతా అన్నింటికంటే పెద్దపీట వేస్తానని మోదీ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ట్రంప్, మోదీ స్పందించారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి పరిష్కారం కనుగొనే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి తన మద్దతు ఉంటుందని మోదీ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచదేశాలు కొంతమేర భావిస్తున్నాయని అయితే భారత్ తటస్థంగా లేదని శాంతి వైపే ఉందని మోదీ స్పష్టం చేశారు. పుతిన్‌తో సమావేశమైనప్పుడు ఇది యుద్ధాల శకం కాదని , యుద్ధ భూమిలో పరిష్కారాలు లభించవని చర్చలతోనే లభిస్తాయని తేల్చిచెప్పినట్లు తెలిపారు.
బంగ్లాదేశ్ పరిస్థితికి మేం కారణం కాదు : ట్రంప్
బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఘర్షణ వాతావరణంపై కూడా ట్రంప్, మోదీ చర్చించారు. వీటి వెనుక అమెరికా హస్తం లేదన్న ట్రంప్ బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడిన ట్రంప్ ఎంతో కాలంగా ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వానికి సిద్ధమన్నారు. తాను సహాయం చేయగలిగితే, సాయం చేయడానికి ఇష్టపడతానని అన్నారు. రక్షణ, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, ఇంధనం, అంతరిక్షంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ రంగాల మధ్య మరింత సహకారం కోసం ఇరుదేశాలు కృషి చేయనున్నాయి.