అమెరికా అధ్యక్షుడిగా వైదొలిగిన తర్వాత తొలిసారిగా ప్రసంగించారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా జో బైడెన్ దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని సంకేతాలిస్తూ.. తన రాజకీయ జీవితం ముగియడానికి ఇంకా ఎంతో సమయం ఉందని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడాలో జరిగిన 2021 కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్(సీపీఏసీ)లో ఆయన తన భవిష్యత్తు కార్యచరణపై మాట్లాడారు.
"నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన మన ఘనమైన ప్రయాణం ముగిసి పోవడానికి ఇంకా ఎంతో సమయం ఉంది. మన ఉద్యమం, పార్టీ, దేశం భవితవ్యం గురించి చర్చించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. నేనేమీ కొత్త పార్టీ పెట్టడంలేదు. నిజానికి ఈసారి ఎన్నికల్లో వారు (డెమొక్రాట్లు) ఓడిపోయారు. ఎవరికి తెలుసు వారిని మూడో సారి కూడా ఓడిస్తానేమో. అమెరికా చరిత్రలో అధ్యక్షుడిగా తొలి నెలలో జో బైడెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఉద్యోగ, కుటుంబ, సరిహద్దు, మహిళలు, సైన్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒక్క నెలలో అమెరికా ఫస్ట్ నుంచి అమెరికా లాస్ట్‌కు వెళ్లిపోయాం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికీ అంగీకరించడం లేదన్నారు ట్రంప్. అమెరికా చట్టాలను అమలు చేయడంలో బైడెన్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఆ ఒక్క కారణంతో మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఓడిపోతారని చెప్పారు.
ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 15,510 కరోనా కేసులు