Canada Next PM Decide On March 9 : కెనడాలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా ఆయన వైదొలుగుతున్నట్లు తెలిపారు. దీంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే లిబరల్ పార్టీ ఓ కీలక ప్రకటన చేసింది. మార్చి 9న తమ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని ప్రకటించింది.
‘కొత్త నేతను పార్టీ ఎన్నుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి కూడా రాజీనామా చేయాలని అనుకుంటున్నా’ అని సోమవారం మీడియా సమావేశంలో ట్రూడో తెలిపారు. కొత్త నేతను ఎన్నుకునేవరకు కెనడా పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్ మార్చి 24వ తేదీ వరకూ కొనసాగుతుందని వెల్లడించారు.
2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ట్రూడోకు ఇటీవల సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 25 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాక వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించలేకపోతే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలంటూ హెచ్చరించారు. దీంతో ట్రూడోపై ఒత్తిడి మరింత పెరిగింది. సొంత పార్టీ నేతలే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
గట్టి పోటీ!
ట్రూడో స్థానంలో తదుపరి నాయకుడు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తదుపరి ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌తో పాటు భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు కెనడా ప్రధాని రేసులో నేనున్నా అంటూ భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని పదవికి గట్టి పోటీ నెలకొంది.