Indiramma Houses Survey In Mahabubnagar : గతేడాది నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హుల కంటే అనర్హులే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గ్రామాలు, పట్టణాల్లో సొంతిల్లు ఉన్నప్పటికీ లేవని పలువురు దరఖాస్తులు చేసుకున్నట్లు సర్వేలో బయటపడుతోంది. సర్వేయర్లు కొళ్ల ఇళ్లను మంజూరు చేసేందుకు గత నెల నుంచి దరఖాస్తులు చేసుకున్న వారి దగ్గరకు వెళ్లి పరిశీలించగా సొంతిళ్లు ఉన్నా దరఖాస్తులు చేసుకున్నట్లు గుర్తించారు.
సొంతిళ్లు ఉన్నా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు : నారాయణపేట జిల్లా ధన్వాడలో ఇందిరమ్మ ఇళ్లను శిక్షణ కలెక్టర్ పరిశీలించారు. ఈ పట్టణంలో మొత్తం 3,043 ఇళ్లు ఉన్నాయి. ఇందులో ఆస్తి పన్ను చెల్లించేవి 2,053 మాత్రమే. అంటే 990 ఇళ్లు పడిపోయినవి లేదా పునాదికే పరిమితమైనవే ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం 2486 దరఖాస్తులు వచ్చాయి. అంటే కొందరు సొంతిళ్లు ఉన్నా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేశారని తెలుస్తుంది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అనర్హులే ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది.
అనర్హులే ఎక్కువ దరఖాస్తులు : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలు, 11 మండలాల నుంచి మొత్తం 1,48,780 దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇక్కడ 1,24,877 కుటుంబాలు, అలాగే 1,38,111 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి కన్నా ఎక్కువ ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. కుటుంబాలు, రేషన్ కార్టుల వివరాలు పాతవి, ప్రస్తుత కుటుంబాల సంఖ్య, రేషన్ కార్డుల అర్హులను పరిగణలోకి తీసుకుంటే మరికొంత మంది పెరగవచ్చు. సొంత ఇళ్లు ఉన్నావారు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సర్వేయర్లు గుర్తించారు. పలు చోట్ల భవనాల ఫోటోలు తీసేందుకు దరఖాస్తులు నిరాకరించడంతో ఎలాగో సర్దిచెప్పి 3 రకాల ఫోటోలు తీసి వివరాలు నమోదు చేసుకున్నారు. మరికొంత మంది అద్దె ఇళ్లు అని లేదా అన్నదమ్ములకు సంబంధించిందని చెబుతూ ఫోటోలు దిగారు.
ఆందోళనలో అర్హులు : అనర్హులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ దరఖాస్తు విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొదట ఇల్లు లేనివారికే ప్రాధాన్యం ఇస్తామని చెబుతుండటంలతో వీరికి కొంత ఉపశమనం లభిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులా? - ఈ వెబ్సైట్లో ఫిర్యాదు చేసేయండి
ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వేలో అక్రమాలు! - తిరిగి దరఖాస్తుల పరిశీలన - ఫైనల్ లిస్ట్ ఎప్పుడంటే?