Trump Hush Money Case Verdict : అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన హష్ మనీ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆయనకు అన్‌కండిషనల్ డిశ్చార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలినప్పటికీ, ఎటువంటి జైలు శిక్ష, జరిమానా ఎదుర్కోనవసరం లేదు. దీంతో దోషిగా నిర్ధరణ అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు.
నేను నిర్దోషి: ట్రంప్
హష్ మనీ కేసుకు సంబంధించి న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ ఎం.మెర్చన్ తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా తన లాయర్‌తో కలిసి డొనాల్డ్ ట్రంప్ వర్చువల్‌గా పాల్గొన్నారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని మరోసారి న్యాయమూర్తి ముందు పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో తనకు లక్షలాది ఓట్లు వచ్చాయని, పాపులర్ ఓటులో తానే విజయం సాధించానని చెప్పారు. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కేసులో రాజకీయ కోణం ఉందన్న ఆయన, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు. ట్రంప్ తరఫున న్యాయవాది కూడా ఇదేవిధమైన వాదనలు వినిపించారు. అంతకుముందు తనకు శిక్ష ఖరారు చేస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ డొనాల్డ్ ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు అక్కడ చుక్కెదురైంది.

హష్ మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా, గత నవంబరులో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దాంతో తాను క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు, కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. చివరకు ఆయనకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చిన న్యూయార్క్ కోర్టు.. జనవరి 10న శిక్ష విధిస్తానంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తీర్పు వెలువరించింది.
ఏంటీ హష్ మనీ కేసు?
శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇప్పించారన్నది ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పు వెలువరించింది. ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం శిక్షను వెలువరించింది.