Biden On Trump Reelection : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హారిస్ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీల్లో తాను ఉంటే కచ్చితంగా ట్రంప్‌ను ఓడించేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ పార్టీలో ఐక్యత కోసమే పోటీ నుంచి వైదొలిగానని బైడెన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తిరిగి పోటీ చేయకూడదనే నిర్ణయంపై విచారిస్తున్నారా? ఆ చర్య ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడానికి సహాయపడిందా? అంటూ విలేకరులు అడిగి ప్రశ్నకు బైడెన్ ఈ మేరకు స్పందించారు.
'అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలదని అనుకున్నాం. అందుకే అమెకు మద్దతిచ్చాం. ఇప్పటికీ కమలా విజయం సాధించగలని నమ్ముతున్నా. అమెరికా రాజకీయాల్లో కనిపిస్తున్న విభజనకు స్వస్తి పలకడానికే అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నా. నేను ఎన్నికల బరిలో ఉంటే ట్రంప్ కచ్చితంగా ఓడిపోయేవారు' అని బైడెన్ అన్నారు.
ఎన్నికల రేసులో తొలుత డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెనే పోటీగా నిలబడ్డారు. సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడం, ఆరోగ్య సమస్యల కారణంగా అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్‌కు తన మద్దతు ప్రకటించారు.
హష్ మనీ కేసు డెమొక్రాట్ల 'నీచమైన ఆట'
మరోవైపు హష్ మనీ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది డెమొక్రాట్ల ఆట అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు.
'అన్‌కండిషనల్ డిశ్చార్జ్‌ని ఇచ్చారు. ఇలాంటి కేసు ముందెన్నడూ లేదని లీగల్ స్కాలర్లు, నిపుణులు అంటున్నారు. ఈ కేసును కొట్టివేసేందుకు అర్హత ఉంది. ఇలాంటి బూటకపు కేసుపై మేం అప్పీల్ చేస్తాం. అంతేకాకుండా ఒకప్పటి మన గొప్ప న్యాయవస్థపై అమెరికన్లు పెట్టుకున్న నమ్మకాన్ని పునరుద్ధరిస్తాం' అని టంప్ర్ అన్నారు.
హష్ మనీకేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే, గత నవంబరులోనే న్యూయార్క్ కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో తాను క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు తొలుత శిక్షను విధించకుండా నివరధికంగా వాయిదా వేయగా, అనంతరం రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం న్యూయార్క్ జడ్జి తీర్పు వెలువరించారు. దోషిగానే నిర్ధరిస్తూ ఎలాంటి శిక్ష, జరిమానా లేకుండా బేషరతు విడుదలని అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో దోషిగా నిర్ధరణ అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు.