Massive Gold In Sindhu River Pakistan : అలావుద్దీన్ అద్భుత దీపం ఉందో లేదో కానీ అలాంటిదే ఒక ఆశాదీపం పాకిస్థాన్‌కు కనిపించింది. ఒకవేళ అది దక్కితే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు భారీ ఊరట లభిస్తుంది. పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. దాదాపు 32.6 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రూ.18వేల కోట్లు (600 బిలియన్ పాకిస్థానీ రూపాయలు) ఉంటుందని అంచనా వేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (జీఎస్‌పీ) కూడా ఆ వివరాలను ధ్రువీకరించింది.
పాక్ ప్రజలకు మంచి రోజులు?
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఒక దాని వెంట మరో కష్టం పాకిస్థాన్‌ను వెంటాడుతోంది. ఓ వైపు నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితం భారంగా మారింది. మరోవైపు వరుస ఉగ్రదాడులతో ఎంతోమంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్‌కు బంగారం నిల్వలు బయటపడ్డాయనే వార్త భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తించింది.
ఒకవేళ వాటి వెలికితీత ప్రక్రియ మొదలైతే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం కలుగుతుంది. దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు బాటలు పడతాయి. పాక్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతుంది. వెరసి నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది.
త్వరలో అధికారిక ప్రకటన!
అటోక్ జిల్లాలోని సింధూ నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించడంపై పూర్తి దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయని ఆయన తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పంఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలను గుర్తించామన్నారు. పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్‌లలో సైతం బంగారం నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై నిషేధం అమలవుతుందని ఇబ్రహీం హసన్ మురాద్ తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.
సింధూ నదిలో బంగారం ఎక్కడిది ?
సింధూ నది పాకిస్థాన్ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుతుంటుంది. సింధూ నది, హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. అవి సింధూ నది ప్రవాహం ద్వారా పాకిస్థాన్‌లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలో వ్యాపిస్తుంటాయి. వందల ఏళ్లతరబడి నిరంతరాయంగా సింధూ నది ప్రవాహం జరిగిన ఫలితంగా, ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్ల పేరుకుపోయాయి.
ఇప్పుడవి పాక్ ఆర్థికస్థితిని మార్చబోతున్నాయి. చలికాలంలో సింధూ నది లోయలో నీటి నిల్వ తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మైనింగ్ చేస్తే బంగారం నిల్వలను సులభంగా వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నిల్వల మైనింగ్, ప్రాసెసింగ్, వినియోగం వంటి అంశాలపై ఆయా ప్రావిన్స్‌లు, పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదరాల్సి ఉంది. కాగా, చైనాలోని పింగ్ షియాంగ్ కౌంటీ పరిధిలో ఇటీవలే రూ.7 లక్షల కోట్లు విలువైన బంగారం నిల్వలను గుర్తించారు.