ETV Bharat / international

కరోనాను ఖతం చేసే యంత్రం ఆవిష్కరణ! - corona destroyer

హ్యూస్టన్​ వర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త గాలి శుద్ధీకరణ యంత్రాన్ని ఆవిష్కరించారు. ఈ యంత్రం గాలిలోని (కరోనా) వైరస్​ను సంగ్రహించి వెంటనే నిర్వీర్యం చేస్తుందని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన పత్రాన్ని ‘మెటీరియల్స్‌ టుడే ఫిజిక్స్‌’లో ప్రచురించారు.

Houston scientists who invented the air purification machine that destroys the corona
కరోనాను ఖతం చేసే యంత్రం ఆవిష్కరణ!
author img

By

Published : Jul 9, 2020, 7:16 AM IST

కొవిడ్‌-19కు కారణమవుతున్న వైరస్‌ను 'పట్టుకుని చంపేసే' సామర్థ్యమున్న గాలి శుద్ధీకరణ యంత్రాన్ని(ఎయిర్‌ ఫిల్టర్‌) రూపొందించినట్లు హూస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన బృందం వెల్లడించింది. ఈ యంత్రం గాలిలోని వైరస్‌ను సంగ్రంహించి వెంటనే నిర్వీర్యం చేస్తుందని వారు తెలిపారు. హూస్టన్‌ విశ్వవిద్యాలయంలోని టెక్సాస్‌ సెంటర్‌ ఫర్‌ సూపర్‌కండక్టివిటీ సంస్థ డైరెక్టర్‌ ఝిఫెంగ్‌ రెన్‌, హూస్టన్‌కు చెందిన వైద్య సంస్థ మెడిస్టార్‌ సీఈవో మొంఝెర్‌ హౌరానితో పాటు మరికొందరు పరిశోధకులు ఈ యంత్రం రూపకల్పనలో పాలుపంచుకున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన పత్రాన్ని 'మెటీరియల్స్‌ టుడే ఫిజిక్స్‌'లో ప్రచురించారు. అందులోని ముఖ్య వివరాలివీ.

  • ఈ యంత్రంలోకి గాలి ప్రవేశించినప్పుడు అందులో కొవిడ్‌-19కు కారణమవుతున్న సార్స్‌-కొవ్‌-2ను 99.8 శాతం వరకూ సంహరిస్తోందని గల్వేస్టన్‌ నేషనల్‌ ల్యాబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఆంత్రాక్స్‌ వ్యాధికి కారణమైన బసిల్లస్‌ బ్యాక్టీరియా మూలాలను కూడా ఈ యంత్రం 99.9 శాతం వరకూ అంతమొందిస్తోందని వెల్లడైంది.
  • గాలిలో వైరస్‌ 3 గంటలకు పైగా జీవించి ఉన్నట్లు తేలిందని, అందుకే దాన్ని గాల్లోనే సాధ్యమైనంత త్వరగా చంపేసే వ్యూహంతో ఈ యంత్రానికి రూపకల్పన చేశామని పరిశోధకులు చెప్పారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వ్యాపార కార్యకలాపాలు పెరుగుతుండటంతో ఎయిర్‌ కండిషన్‌ ఉన్న గదుల్లో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం అత్యంత అవసరమని వారు తెలిపారు.
  • విద్యాసంస్థలు, కార్యాలయాలు, విమానాశ్రయాలు, విమానాలు, క్రూజ్‌ ఓడలు లాంటి జనసమ్మర్ద ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇది ఉపకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. కార్యాలయాల్లో వాడటానికి అనువుగా డెస్క్‌టాప్‌ మోడల్‌ ఎయిర్‌ ఫిల్టర్‌ను తయారుచేసే ఆలోచన ఉన్నట్లు మెడిస్టార్‌ సంస్థ తెలిపింది.
  • మార్కెట్లో లభించే నికెల్‌ ఫోమ్‌ను 200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే ప్రక్రియ ద్వారా ఈ పరికరం పనిచేస్తుందని తెలిపారు. 70 డిగ్రీల సెంటిగ్రేడ్‌ లేదా 158 డిగ్రీల ఫారెన్‌హీట్‌ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వైరస్‌ బతకదని తేలిందని, అందుకే అతి ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉండే ఫిల్టర్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు మెడిస్టార్‌ తెలిపింది.
  • ఎలక్ట్రికల్‌ పద్ధతిలో వేడి చేసేలా ఈ ఫిల్టర్‌ను రూపొందించామని, తద్వారా ఈ యంత్రం నుంచి బయటకు వెళ్లే వేడి శాతాన్ని సాధ్యమైనంత తగ్గించామని తెలిపారు. దానివల్ల ఎయిర్‌ కండిషన్డ్‌ వాతావరణంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.
  • ఈ పరికరాన్ని తొలి దశలో అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు పనిచేసే ప్రదేశాల్లో వినియోగిస్తామని, తద్వారా వారు కరోనా బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తామని చెప్పారు. ఈ యంత్రం ద్వారా అత్యవసర విభాగాల ఉద్యోగులకు భద్రత పెరుగుతుందని, ఇతర ఉద్యోగులూ తమ పని ప్రదేశాలకు తిరిగి వచ్చేందుకు సహకరిస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి: చైనాకు భారత్​ దీటుగా బదులు చెప్పింది: పాంపియో

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.