గ్రేటర్ బరి: తెరాస అభ్యర్థుల ఖరారు.. ఆశావహుల్లో ఉత్కంఠ - ghmc elections-2020
గ్రేటర్ హైదరాబాద్ తెరాస ఆశావహులు ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీటు దక్కుతుందో లేదోనని ఊపరిబిగపట్టి ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఏ నిమిషాన్నైనా జాబితా ప్రకటించేందుకు గులాబీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఎక్కువ శాతం సిట్టింగ్ అభ్యర్థులకే మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. అయితే తమకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్‌పై వివిధ వర్గాల ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల నగారా మోగినందున... తెరాసలో టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చేరాయి. మహా నగరంలోని 150 డివిజన్లలో తెరాస తరఫున పోటీ చేసేందుకు విపరీతమైన పోటీ నెలకొంది. దాదాపు ప్రతి డివిజన్లో కనీసం అరడజను నుంచి డజను మంది ఆశావహులు ఉన్నారు. కొన్ని రోజులుగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను ఆకర్షించేందుకు వివిధ రూపాల్లో నేతలు ప్రయత్నిస్తున్నారు. లాక్డౌన్, వరద సమయాల్లో చురుగ్గా పాల్గొంటూ కేటీఆర్‌కు ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేసి ఆయన దృష్టిలో పడేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరి కొందరు వివిధ సందర్భాల్లో నేరుగా కలిసి బయోడేటాలు ఇవ్వగా... ఇంకొందరు కేసీఆర్ దృష్టిలో తమ పేర్లు ఉండేలా నానా తంటాలు పడ్డారు.
దాదాపుగా పాతవారే..
నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నందున... అభ్యర్థుల జాబితాకు తెరాస నాయకత్వం తుది మెరుగులు దిద్దుతోంది. ఎక్కువ శాతం సిట్టింగ్ అభ్యర్థులనే మళ్లీ బరిలోకి దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున... కొత్తవారికి ఇస్తే దూసుకెళ్లేందుకు కొంత సమయం పడుతుందని ఆలోచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే మరో ఐదేళ్ల పాటు రిజర్వేషన్లు కొనసాగించేలా చట్ట సవరణకు ప్రభుత్వం చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొందరు పనితీరు బాగా లేదని సర్వేల్లో తేలడం, మరికొందరికి అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని... దాదాపు 20 నుంచి 30 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఉద్యమం కాలం నుంచి పార్టీలో ఉన్నామని, మరికొందరు టికెట్‌పై ఆశతోనే ఇతర పార్టీల నుంచి వచ్చామంటూ ఒత్తిడి తెస్తున్నారు.
ఎమ్మెల్యేలదే బాధ్యత..
ఎంఐఎంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ... పాతబస్తీలోని డివిజన్లకు కూడా తెరాస అభ్యర్థులను నిలబెట్టనుంది. ఏ క్షణమైనా ప్రకటించేందుకు 100కు పైగా అభ్యర్థులతో జాబితా సిద్ధమైంది. సిట్టింగులు పోటీ చేసే ప్రాంతాలపై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వం స్పష్టతనిచ్చింది. దీంతో కొందరు నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేసుకున్నారు. మరోవైపు అభ్యర్థులను ప్రకటించగానే ఆశావహుల నుంచి పెద్ద ఎత్తున అసమ్మతి, అసంతృప్తి రావచ్చని అధిష్ఠానం అంచనా వేస్తోంది. ఇందుకోసం అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలిచ్చింది. టికెట్లు రాని వారికి ఇతర పార్టీలు గాలం వేసే అవకాశం ఉన్నందున... పార్టీ వీడకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదేనని స్పష్టతనిచ్చింది. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని... అవసరమైతే భవిష్యత్తులో ఇతర పదవుల్లో అవకాశం ఉంటుందన్న భరోసా ఇవ్వాలని అధిష్ఠానం నిర్దేశించింది.
ఇదీ చూడండి: గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు