విద్యుత్ బిల్లు కట్టలేదా?.. అయితే వడ్డీ కట్టాల్సిందే - తెలంగాణలో విద్యుత్ బకాయిలు
విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వచ్చాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం 3 వాయిదాల్లో 3 నెలలపాటు చెల్లించే వెసులుబాటు కల్పించింది. లేనిపక్షంలో 1.50 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.

విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వచ్చాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం 3 వాయిదాల్లో 3 నెలలపాటు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఎలాగూ వెసులుబాటు కలిగిందికదా అని నిర్ణీత గడువులోగా ఆ వాయిదా సొమ్మును చెల్లించనివారికి విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లు వడ్డీభారం మోపనున్నాయి. తొలి వాయిదా బిల్లును ఈ నెల 20వ తేదీలోపు చెల్లించాలి. లేనిపక్షంలో 1.50 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. ఈ నిబంధన ఎప్పటి నుంచో అమలులో ఉన్నా.. లాక్‌డౌన్ వల్ల వడ్డీ మినహాయింపు ఉండవచ్చని చాలామంది వినియోగదారులు భావిస్తున్నారు. అందుకే నిర్ణీత గడువులోపు చెల్లించనివారికి పాత నిబంధనల ప్రకారమే వడ్డీని వసూలు చేస్తామని డిస్కంలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలో మొత్తం 90.36 లక్షల మంది వినియోగదారులున్నారు. అందులో లాక్‌డౌన్ కారణంగా గత మార్చి నుంచి మే వరకూ 40.69 లక్షల మంది అసలు బిల్లులే కట్టలేదు. వీరు రూ.444.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై 1.50 శాతం చొప్పున రూ.6.66 కోట్ల వడ్డీ వేశారు. జారీఅయిన బిల్లు సొమ్ములో ఈ నెల 30 శాతం, జులైలో 40, ఆగస్టులో మిగిలిన 30 శాతం చొప్పున కట్టాల్సి ఉంది. ఈ నెల 30 శాతం కట్టిన వారికి మిగిలిన 70 శాతం సొమ్ముపై 1.50 శాతం వడ్డీ వేస్తామని డిస్కంలు తెలిపాయి.