ఊరెళ్లేందుకు ఆరాటం..ఈనెల 15న రైళ్లు, బస్సులు పుల్.. - ఏపీఎస్‌ఆర్టీసీ
లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే సొంతూళ్లకు వెళ్లిపోవాలనే ఆశతో వేలమంది ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14వ తేదీకి లాక్‌డౌన్ పూర్తవుతుంది. 15 నుంచి బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తాయనే నమ్మకంతో హైదరాబాద్‌లో ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన వేలమంది స్వస్థలాలకు పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 15న హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు.. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లోని సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి
ఈ నెల 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణాసంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సుల రిజర్వేషన్లకు అనుమతించింది. ఫలితంగా ఆ రోజు ఎలాగైనా ఊళ్లకు వెళ్లాలని భావించిన ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకున్నారు. విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, కడప మార్గాల్లో 15వ తేదీకి ఆర్టీసీ బస్సుల్లో దాదాపు సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో చివరి క్షణంలో ఊళ్లకు వెళ్లలేకపోయినవారు, సరిహద్దుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినవారు, రవాణా సౌకర్యాలు మొదలైన వెంటనే సొంతూళ్లకు చేరుకోవాలని ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు.
ఉదయం పదింటికి మొదటి సర్వీసు..
ఎంజీబీఎస్ నుంచి విజయవాడకు ఉదయం పదింటికి మొదటి సర్వీసు నడుపుతామని ఏపీఎస్‌ఆర్టీసీ పేర్కొనగా రిజర్వేషన్లు మొదలయ్యాయి. 14 అర్థరాత్రి లాక్‌డౌన్ ముగిస్తే ఉదయానికల్లా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని.. బస్సులు తిరుగు ప్రయాణం అవుతాయని భావించి అధికారులు రిజర్వేషన్లకు అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. దూరప్రాంతాల నుంచి బస్సులు వచ్చే అవకాశాలు లేనందున కాకినాడతో పాటు కొన్ని రూట్లలో 16వ తేదీకి రిజర్వేషన్లు అయిపోయాయి.
అన్ని మార్గాల్లో బెర్తులు లేవు..
ఇటీవలే 15వ తేదీ నుంచి నడిచే రైళ్లకు రిజర్వేషన్లు ప్రారంభించారు. మూడు నాలుగురోజుల్లోనే బెర్తులన్నీ రిజర్వ్ అయిపోయాయి. ప్రస్తుతం వందల వెయిట్ లిస్ట్ కొనసాగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లలో రిజర్వేషన్లు చేసుకున్నారు. 15వ తేదీకి సుమారు 100కి పైగా రైళ్లలో స్లీపర్ క్లాస్ నుంచి ఫస్ట్ ఏసీ వరకు బెర్తులన్నీ రిజర్వ్ కావడం గమనార్హం.
ఆత్రంగా ఎదురుచూస్తున్నా..
15వ తేదీ బస్సులు నడుస్తాయని ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్నట్లు తిరుపతికి చెందిన రాజేశ్ తెలిపారు. ఒక రోజే లాక్‌డౌన్ ఉంటుందని భావించి 24వ తేదీ వెళ్లాలనుకుని హైదరాబాద్‌లోనే ఉండిపోయినట్లు చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీ రిజర్వేషన్‌లు ప్రారంభించిన వెంటనే టికెట్ తీసుకున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్ పొడిగిస్తే ఎలా చేయాలో అర్థం కావడంలేదన్నారు. సొంతూరుకి వెళ్లేందుకు ఆత్రంగా ఎదురుచూస్తున్నానని ఆయన వివరించారు.
ఇవీ చూడండి: వైరల్ వీడియో: డ్రోన్ కెమెరా చూసి ఇక పరుగో పరుగు