Partner Support During Pregnancy : ప్రసవం మహిళకు పునర్జన్మ లాంటిది అంటారు. అందుకే గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు మహిళకు అన్నివిధాల సహకారం అవసరం. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో అందరూ పక్కన ఉంటూ కంటికి రెప్పలా చూసుకునేవారు. కెరీర్, ఉద్యోగాల పేరుతో ఊరికి, అమ్మనాన్నలకు చాలా మంది దూరంగా ఉంటున్నారు.
Pregnancy Care Tips : తొలి కాన్పు ఎక్కువగా పుట్టింట్లో చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో సిటీల్లో వైద్య సదుపాయాలు ఉండటంతో ఫస్ట్ కాన్పులూ ఇక్కడే చేస్తున్నారు. ఈ క్రమంలో కన్నవారి స్థానంలో కట్టుకున్నవారే సపర్యలు చేస్తున్నారు. భార్య గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు భర్తలే చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేసే మహిళలకు మెటర్నిటీ లీవ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు పురుషులకు సైతం మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నాయి. వీటిని ఉపయోగించుకుంటూ భార్యకు బిడ్డపుట్టే వరకు మహిళను కనిపెట్టుకుంటూ సహకారం అందిస్తున్నారు. వైద్య పరమైన జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా వరకు సాధారణ కాన్పులు అవుతున్నాయని వైద్యులు అంటున్నారు.
భర్త మరింత కంటికి రెప్పలా కాపాడుకోవాలి : మహిళ గర్భం దాల్చిన తరువాత వచ్చే మార్పులను కౌన్సిలింగ్ ద్వారా తమ వద్దకు వచ్చే వారికి విడమర్చి చెబుతామని కిమ్స్ కడల్స్ వైద్యులు డా. సాహితి బల్మూరి అన్నారు. మొదటి నెల నుంచి ప్రసవం వరకు వచ్చే మార్పులను ఆయా మహిళల భర్తలకు వివరిస్తామని అన్నారు. ఈ రోజుల్లో కాన్పు అంటే ఒక్క మహిళదే బాధ్యత కాదని, భార్యతో సమానంగా భర్త సహాయం అందించాలని తెలిపారు. పెద్దవారు లేని ఇళ్లల్లో భర్త మరింత కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. అది పుట్టబోయే బిడ్డకు ఎంతో మేలు చేస్తుందని ఆమె వివరించారు.
ఎక్కువగా సిజేరియన్లు : ప్రస్తుతం అవసరం ఉన్నా, లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. ఇందులో అటు ఆసుపత్రులే కాకుండా గర్భిణి కుటుంబ సభ్యుల పాత్ర ఉంటోంది. నొప్పులు భరించలేరన్న భయంతో కొందరు, ఫలానా ముహూర్తానికే బిడ్డ పుట్టాలంటూ మరికొందరు సిజేరియన్ చేయిస్తున్నారు. ఇవన్నీ సరికాదని వైద్యులు అంటున్నారు. మహిళ ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా సాధారణ ప్రసవమే మంచిదని వారు సూచిస్తున్నారు. భర్తలు సహకారం అందిస్తే ఇది సాధ్యమవుతోందని, ఇలా భార్యకు భర్త అన్నింటా చేదోడు వాదోడుగా ఉండటం, పుట్టే బిడ్డకే కాదు, దంపతుల మధ్య అన్యోన్యతకు ఒక టానిక్‌లా పని చేస్తుందని మానసిక నిపుణులు సైతం అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
టీనేజ్లోనే గర్భం? ఈ వయసులో కాన్పు మంచిదేనా? డాక్టర్లు ఏం అంటున్నారంటే?
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?- అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే! - Birth Control Pill