Trump First Day Executive Orders : అమెరికా పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసే జనవరి 20న సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది! క్యాపిటల్ హిల్‌లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో రిపబ్లికన్ సెనేటర్లకు ట్రంప్ ఇప్పటికే ఆ విషయాన్ని వెల్లడించగా, ప్రస్తుతం ఆయన కార్యవర్గం ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా పనిచేస్తోందని సమాచారం.
ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ట్రంప్ సంతకం చేయనున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. వాటిలో ముఖ్యంగా ఏడు అంశాల చుట్టూ ఉంటాయని సమాచారం. దేశ దక్షిణ సరిహద్దులు మూసివేయడం, వలసదారుల డిపోర్టేషన్, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, క్షమాభిక్షలు- ఇలా వివిధ పనులను తొలి రోజే మొదలుపెట్టాలని సంకల్పించుకున్నారు ట్రంప్.
2021లో జరిగిన ఓటరు తీర్పును ధిక్కరిస్తూ 2021 జనవరి 6న వేల మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద బీభత్సం సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ ఓటమిని అంగీకరించకుండా తిరిగి ట్రంప్‌ను అధ్యక్షుడిగా గుర్తించాలంటూ హింసకు పాల్పడ్డారు. ఇప్పటికే 1500 మంది దోషులుగా తేలగా, వారిని అధికారం చేపట్టిన తొలిరోజే క్షమాభిక్ష ప్రసాదిస్తానని వాగ్దానం చేశారు ట్రంప్. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలన్నది ఆయన మరో ఆలోచన. అదే జరిగితే ఒక్కసారే 15వేల మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది.
వలసదారుల్ని బలవంతంగా స్వదేశాలకు పంపాలని ట్రంప్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అమెరికాలో దాదాపు కోటీ 10 లక్షల మంది విదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నారని అంచనా. వీరిని బలవంతంగా దేశం నుంచి వెళ్లగొడతామని ఆయన పదేపదే చెప్పారు. మరోవైపు, సరిహద్దు విధానాలకు సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నిర్ణయాలను ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా-మెక్సికో సరిహద్దుకు అదనపు బలగాలను తరలించడం, సరిహద్దు గోడను పునర్నిర్మించడం వంటి వాటిపై ఆయన దృష్టి సారించనున్నట్లు సమాచారం.
సుంకాలు తప్పవ్!
చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై గతంలో ప్రకటించిన సుంకాలపై ట్రంప్ సంతకం చేసే అవకాశం ఉంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ గతంలో కూడా అధిక మొత్తంలో సుంకాలు విధించారు, ఇప్పుడూ విధిస్తానని ప్రచారంలో చెప్పారు. అలా సుంకాలు విధిస్తే అమెరికాకు చాలా లాభాలు ఉంటాయని అన్నారు. అందుకే తొలిరోజే సుంకాల మోత మోగించేందుకు సిద్ధమయ్యారు. పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోకు కూడా బిగ్ షాక్ ఇవ్వనున్నారు. ఆ దేశాల నుంచి అమెరికాలోకి నేరస్థులు, మాదక ద్రవ్యాల రాకను అడ్డుకునే వరకు25శాతం దిగుమతి సుంకం వేస్తానని ఇప్పటికే ప్రకటించారు.
దేశీయ చమురు వెలికితీతను పెంచడంపై బైడెన్ నిర్ణయాన్ని వెనక్కి ట్రంప్ తీసుకోనున్నారని తెలుస్తోంది. అలా చేస్తేనే ఇంధన ఖర్చులు తగ్గుతాయన్నది ఆయన వాదన. వాస్తవానికి కాలుష్యం, భూతాపాన్ని తగ్గించేందుకు బైడెన్ సర్కారు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, పెట్రోల్-డీజిల్ కార్లకు బదులు ఈవీలను ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసింది. కానీ బైడెన్ విధానాలన్నింటినీ రివర్స్ చేస్తూ తొలి రోజే ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.