Tamilnadu Road Accident : తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపత్తూర్ జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిందీ ఘటన.
టైర్ పంక్చర్ అయిందని..
తమిళనాడులోని అంబూర్కు సమీపంలోని ఒనన్గుట్టై గ్రామానికి చెందిన 45 మంది.. రెండు వ్యాన్లలో ఈనెల 8న కర్ణాటకలోని ధర్మస్థలకు వెళ్లారు. యాత్ర పూర్తి చేసుకుని వారంతా తిరిగి వస్తున్నారు. సోమవారం వేకువజామున తిరుపత్తూర్ జిల్లా నత్రంపల్లి సమీపంలోని చండియూర్ వద్ద ఓ వ్యాన్ టైర్ పంక్చర్ అయింది. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై వాహనాన్ని ఓ పక్కన ఆపి.. డ్రైవర్ టైర్ మార్చుతున్నాడు. ప్రయాణికులు ఆ సమయంలో కిందకు దిగి వ్యాన్ దగ్గరే నిల్చుని ఉన్నారు.
అదే రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ లారీ.. ఆగి ఉన్న వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. రోడ్డుకు అవతలివైపునకు వెళ్లి బోల్తా కొట్టింది. వ్యాన్, మినీ లారీ ఢీకొనడం వల్ల అక్కడే నిల్చున్న వారిలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు గాయపడ్డారు.
ఈ ఘటనను చూసిన ఇతర వాహనదారులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. లారీ డ్రైవర్, క్లీనర్ సహా 10 మందిని కాపాడి ఆస్పత్రులకు తరలించారు.
మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు..
Assam Road Accident : నాలుగు రోజుల క్రితం అసోంలోనూ ట్రక్కు- టాటా మ్యాజిక్ ఢీ కొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తింసుకియా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తింసుకియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని అక్కడి నుంచి.. రాత్రికి రాత్రే దిబ్రూగఢ్‌లోని అసోం మెడికల్ కాలేజ్‌కు తీసుకెళ్లారు. జిల్లాలోని దుందుమ వారాంతపు మార్కెట్‌కు వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ అతిగా మద్యం సేవించి వాహనం నడపడమే.. ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.