Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నందున- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం- గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పూజారీ కాంకేర్, మారేడుబాక అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు భారీ స్థాయిలో యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపుర్, సుక్మా జిల్లాల పరిధిలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, CRPFకు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. వారంతా అడవిలో గాలింపు చర్యలు చేపడుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే పరస్పరం ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.