Rajiv Gandhi assassination: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 47 ఏళ్ల ఎ.జి.పెరారివలన్‌కు బుధవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు దాదాపు 30 ఏళ్లకు పైగా ఖైదు అనుభవించాడని, కారాగారంలో, పెరోల్ సమయంలోనూ అతని ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే పిటిషన్‌ను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, తాము బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
బెయిల్ సమయంలో ప్రతి నెల తొలి వారంలో పెరారివలన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. రాజీవ్ హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు పలు పిటిషన్లపై విచారణ చేస్తోంది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ తీవ్రవాదులు హత్యచేశారు. ఈ కేసులో పెరారివలన్, మురుగన్, సంతన్, నళినిలకు సర్వోన్నత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు మేరకు 2000లో నళిని మరణశిక్షను గవర్నర్ జీవితఖైదుగా మార్చారు. క్షమాభిక్ష పిటిషన్లు పదకొండేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో 2014లో మిగిలిన ముగ్గురి మరణశిక్షలను కూడా సుప్రీం కోర్టు జీవితఖైదుగా మార్చింది. అయితే 2018లో ఈ కేసులోని ఏడుగురు దోషులనూ విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేసింది.
ఇదీ చదవండి: డ్రగ్స్‌కు బానిసైన చిలుకలు.. నల్లమందు కోసం పంటల ధ్వంసం