మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. అధికార కూటమిలోని కొందరు ప్రముఖ నేతలు ఎన్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయా పార్టీల్లో ఉంటే వారికి భవిష్యత్తు ఉండదనే విషయాన్ని వారు గ్రహించారని.. అందుకే ప్రతిపక్ష పార్టీతో కలిసేందుకు చూస్తున్నారని తెలిపారు.
భాజపాకు చెందిన ఏక్నాథ్ ఖడ్సే వంటి నేతలు ఎన్సీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారన్న ఊహాగానాలు వస్తున్నాయని అడిగిన ప్రశ్నలపై ఈ విధంగా స్పందించారు పవార్.
" అధికార పార్టీలకు చెందిన పలువురు నేతలు మాతో సన్నిహితంగా ఉన్నారు. నాతోనే కాదు జితేంద్ర ఆవాడ్, ఆనంద్ పరాంజపెలతో పాటు ఇతర జిల్లా నేతలతో సుమారు 3, 4 నెలల నుంచే సంప్రదింపులు జరుపుతున్నారు."
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
భాజపాపై విమర్శలు..
భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు పవార్. మహారాష్ట్రలోని ప్రధాన సమస్యలైన రైతు ఆత్మహత్యలు, కరవుపై భాజపా వద్ద పరిష్కారాలు లేవన్నారు. అక్టోబర్ 21 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టికల్ 370, రామ మందిరం వంటి భావోద్వేగ సమస్యలను లేవనెత్తుతోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఖడ్సే తిరస్కరణ..
ఎన్సీపీలో చేరనున్నారనే ఊహాగానాలను ఖండించారు బాజపా నేత ఏక్నాథ్ ఖడ్సే. తాను మూడేళ్లలో ఎన్నడూ పవార్‌ను కలవలేదని స్పష్టం చేశారు. పార్టీ మారాలనే నిర్ణయం తాను తీసుకోలేదన్నారు. అది ఎన్నటికీ జరగదని వివరణ ఇచ్చారు.
ఇదీ చూడండి: '2022 నాటికి ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌కు భారత్ దూరం'