Special Story on Police Village Annaram in Karimnagar : ఆటలపై మక్కువ, ఉజ్వల భవిష్యత్తుపై ఆరాటం ఆ గ్రామం నుంచి ఏకంగా 50 మంది ఖాకీ ఉద్యోగం సాధించేలా చేసింది. మరో 25 మంది హోంగార్డులూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారం గ్రామం స్పెషల్ స్టోరీ ఇది. ఈ గ్రామంలో మొత్తం జనాభా 6,225 మంది. ఇక్కడ వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలే ఎక్కువ. మొట్టమొదటి సారిగా 1981 సంవత్సరంలో ఏనుగుల అంజయ్య కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. దాంతో ఈ ప్రస్థానానికి బీజం పడింది. ఐటీఐ చేసిన ఆయన మొదటి ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
అప్పుడే బీజం : మానకొండూర్ పాఠశాలలో ఎన్‌సీసీ విభాగం ద్వారా అలవడిన క్రమశిక్షణ, ఆటలపై మక్కువ నాడు ఉద్యోగం ఎంపిక ప్రక్రియకు ఎంతో దోహదపడ్డాయని అంజయ్య పేర్కొన్నారు. 1992 మరో అడుగుపడి, ఇద్దరు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత నుంచి చాలా మంది యువకులు కానిస్టేబుల్ ఉద్యోగాలపై ఫోకస్ పెట్టారు. ఇంకాస్త కష్టపడితే తామూ ఉద్యోగం సాధించవచ్చని యువకులు గట్టిగా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
1995లో ఆ ఊరి నుంచి ఒక్కసారే 4 మంది పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇదే స్ఫూర్తితో 1998లో నలుగురు, 2000లో 6 మంది, 2002లో ఇద్దరు, 2008లో 4 మంది, 2009 4 మంది, 2012లో నలుగురు, 2018లో 6 మంది, 2009లో నలుగురు, 2012లో నలుగురు, 2018లో ఆరుగురు, 2023లో ఆరుగురు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. వారికితోడు కేంద్ర సాయుధ బలగాల్లో 5 మంది, అగ్నిమాపక శాఖలో ముగ్గురు ఎంపికయ్యారు. ఇదే గ్రామానికి చెందిన శంకర్ అనే హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కావాలనే సంకల్పంతో ఉన్న యువతకు ఆరేళ్ల నుంచి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
బోరిగాం గ్రామంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు.. వాహనాలు సీజ్
అన్నారం నుంచి ఇప్పటివరకు దాదాపు 250 మంది యువకులు పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశారు. ఒకట్రెండు మార్కులతో ఉద్యోగానికి ఎంపిక కాని వారున్నారు. చివరిసారిగా జరిగిన ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ఈ గ్రామం నుంచి 40 మంది అభ్యర్థులు పాల్గొనగా, ఆరుగురు ఉద్యోగాలు సాధించారు. ఇప్పటి వరకు ఎంపికైన వారిలో పాకాల రాజిరెడ్డి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా రిటైర్ అవ్వగా, ఆరెల్లి రాజ్‌కుమార్ ఫింగర్‌ప్రింట్ విభాగంలో సీఐ విధులు నిర్వహిస్తున్నారు. మార్క రాజయ్య ఏఎస్సైగా పని చేస్తున్నారు. తమకూ ఉద్యోగాలు వచ్చేవరకు ప్రయత్నాన్ని కొనసాగిస్తామంటున్నారు ఈ ఊరి యువత.
ఆట దిద్దిన ఖాకీలు - ఆ ఊళ్లో అందరూ పోలీసులే - POLICE VILLAGE IN VIKARABAD