Manmohan Singh Last Journey : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక లాంఛనాలతో రాజ్‌ఘాట్ సమీపంలో నిర్వహించనుంది. అంతిమ యాత్ర ఉదయం 9.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమౌతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
"ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహం మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఆయన నివాసంలో ఉంది. రేపటి ఉదయం వరకు ప్రజలు అక్కడి వచ్చి నివాళులు అర్పించవచ్చు. డిసెంబర్ 28న అంటే శనివారం ఉదయం 8 గంటలకు ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తాం. అక్కడ ఉదయం 8.30 నుంచి 9.30 మధ్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించేందుకు అవకాశం ఇస్తాం. 9.30 గంటల తరువాత అక్కడి నుంచి శ్మశాన వాటికకు మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర మొదలవుతుంది" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఘన నివాళులు
అనారోగ్య సమస్యలతో దిల్లీ ఎయిమ్స్‌లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఈ ఉదయం పలువురు ప్రముఖులు మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ పుష్పాంజలి
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సహా పలువురు పార్టీ నేతలు మన్మోహన్ సింగ్ భౌతికఖాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాజకీయపార్టీల ముఖ్యనేతలు, ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు.
సెల్యూట్
భారత సైన్యం తరఫున సైనికాధికారులు మాజీ ప్రధానికి నివాళి అర్పించారు. మన్మోహన్ పార్థివదేహాన్ని ఉంచిన పేటికపై జాతీయ జెండా ఉంచి సెల్యూట్ చేశారు.
గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం - కేంద్ర కేబినెట్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర కేబినెట్ శుక్రవారం సంతాపం తెలిపింది. మన్మోహన్ గొప్ప రాజనీతిజ్ఞుడని, విశిష్ట నాయకుడిని కొనియాడింది. ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో, మాజీ ప్రధాని మృతికి సంతాప సూచికంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. తరువాత సంతాప తీర్మానాన్ని ఆమోదించారు.
జనవరి 1 నుంచి 7 రోజులపాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేసింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు హాఫ్‌డే సెలవు ప్రకటించింది.
గొప్ప స్నేహితుడిని కోల్పోయాం - ప్రపంచ దేశాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రపంచ దేశాలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు. మన్మోహన్‌ను ఒక ఛాంపియన్‌గా, దూరదృష్టి గల ఆర్థికవేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా అభివర్ణించారు. తమ దేశాలతో భారత్‌కు ఏర్పడిన బంధంలో మన్మోహన్ సహకారాన్ని, స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేసుకున్నారు.
- మన్మోహన్ సింగ్ ఓ ఛాంపియన్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల అమెరికా సంతాపం ప్రకటించింది. భారత దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. భారత్ -అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ ఒకరని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ కొనియాడారు. గత రెండు దశాబ్దాల్లో భారత్-అమెరికా కలిసి సాధించిన ప్రగతిలో చాలా వాటికి మన్మోహన్ పునాది వేశారని అన్నారు. భారత్-అమెరికా మధ్య పౌర అణు సహకార ఒప్పందం ముందుకు తీసుకెళ్లడానికి మన్మోహన్ నాయకత్వం దోహదం చేసిందని తెలిపారు. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు, వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించిన నేతగా మన్మోహన్‌ను గుర్తుంచుకుంటారని బ్లింకన్ పేర్కొన్నారు. భారత్ -అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి మన్మోహన్ సింగ్ చేసిన కృషి, అంకిత భావాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.
- మన్మోహన్ సింగ్ మరణవార్త తననెంతో బాధించిందని కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ అన్నారు. మన్మోహన్ అసాధారణమైన తెలివితేటలు, చిత్తశుద్ధి, వివేకం కలిగిన వ్యక్తి అని అన్నారు.
- భారతదేశం తన ప్రియమైన కుమారుల్లో ఒకరిని కోల్పోయిందని అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అన్నారు. మన్మోహన్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
- మన్మోహన్ మృతి చెందడం భారత్, రష్యాకు తీరని లోటు అని, ఇది ఉద్విగ్నభరిత క్షణమని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన సహకారం ఎనలేనిదని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. ఆర్థికవేత్తగా మన్మోహన్ నైపుణ్యం, భారతదేశ పురోగతికి ఆయన నిబద్ధత, సున్నిత ప్రవర్తన కొనియాడదగినవని తెలిపారు.
- భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరనే వార్త వినడానికి చాలా బాధగా ఉందని, ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఆనందాన్ని కలిగించేదని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ అన్నారు. మన్మోహన్ ప్రవర్తన పిల్లలపై తండ్రి చూపే దయలా ఉండేదని, మాల్దీవులు ఓ మంచి స్నేహితుడిని కోల్పోయిందని అన్నారు.
- మన్మోహన్ మృతిపై నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ సంతాపం తెలిపారు. దూరదృష్టిగల, అసాధారణ రాజనీతిజ్ఞుడిని కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు.
- మన్మోహన్‌ను దూరదృష్టి గల ఆర్థికవేత్తగా, భారతదేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స అభివర్ణించారు. మన్మోహన్ మృతిపై విచారం వ్యక్తం చేశారు.
వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీల్లో చదువు- మన్మోహన్ సింగ్ కుమార్తెలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?