Elinati Shani Remedies : ఒక వ్యక్తి జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడుస్తుంటే వృత్తి, వ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శని త్రయోదశి రోజు చేసే చిన్నపాటి పూజతో ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో ఏయే రాశులకు శని ప్రభావం ఉండబోతోంది? శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేస్తే మంచిది? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
శని త్రయోదశిని ఏ విధంగా నిర్ధరణ చేస్తారు?
తెలుగు పంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు. డిసెంబర్ 28వ తేదీ శనివారం త్రయోదశి తిథి కలిసి వచ్చాయి. కాబట్టి ఆ రోజున శని త్రయోదశి పూజ చేసుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
శని త్రయోదశి పూజకు శుభసమయం
డిసెంబర్ 28వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు శని త్రయోదశి పూజ చేసుకోవాలి.
త్రయోదశి తిథి విశిష్టత
దేవదానవులు చేసిన క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన నీలకంఠుడైన ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిథి నాడే అని శివ పురాణం ద్వారా తెలుస్తుంది.
శని త్రయోదశి ప్రాముఖ్యత
శని త్రయోదశి రోజున శని దేవుడికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
శని దేవుడు కష్టాలు ఇస్తాడా!
జ్యోతిష్య శాస్త్ర రీత్యా శనివారానికి అధిపతి శని భగవానుడు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనిది. అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా, చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుని అనుగ్రహం వల్లనే! నిజానికి శని పాప గ్రహం అంటారు. కానీ ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురి చేసి చెడు మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే! అందుకే శని దేవుని ఆరాధనకు అంతటి విశిష్టత.
శని త్రయోదశి పూజలు ఎవరు చేయాలి?
జాతకం ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేసుకోవడం వలన శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. కొత్త సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నందున మీన రాశి, మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండబోతోంది. అలాగే కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉంది. కాబట్టి ఈ మూడు రాశుల వారు శని త్రయోదశి రోజు శనికి ప్రత్యేక పూజలు జరిపించుకోవడం వలన కొత్త సంవత్సరంలో శుభ ఫలితాలను పొందుతారని పంచాంగ కర్తలు చెబుతున్నారు.
శని త్రయోదశి పూజా విధానం
శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అభ్యంగన స్నానం చేయాలి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లాలి. అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలి. ఈ రోజు ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించడం, తైలాభిషేకం చేయాలి. ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతే కాకుండా ఈ రోజు నల్ల నువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం, దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెబుతారు.
సింపుల్‌గా ఇలా కూడా చేయవచ్చు!
శని త్రయోదశి నాడు సమయాభావం వలన ఇవేమి చేయలేని వారు కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి, శనిదేవుని తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి, 9 ప్రదక్షిణలు చేస్తే శని దేవుని ప్రీతిని పొందవచ్చు. అలాగే శివునికి కానీ, ఆంజనేయస్వామికి కానీ భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్ర వచనం. ఈ రోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం, నల్ల చీమలకు పంచదార పెట్టడం చేస్తే కూడా మంచిది. ఏ పూజకైనా భక్తి ప్రధానం. భక్తితో చేసే చిన్నపాటి పూజకైనా అపారమైన ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.
ఇలా కూడా చేయవచ్చు
శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే కూడా శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించి పూజిస్తే కూడా మంచిది. అందువల్ల రానున్న శని త్రయోదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. సకల దోషాలను తొలగించుకొని సర్వ శుభాలను పొందుదాం. ఓం శ్రీ శనైశ్చరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.