Canada Ministers Meet US Secretary : అమెరికా అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం కెనడా, మెక్సికో దేశాల ఎగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో - ట్రంప్‌తో ఇప్పటికే భేటీ అయ్యి మంతనాలు జరిపారు. ఈ క్రమంలో డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానంటూ ట్రంప్ ఆయనను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
'51వ రాష్ట్రంగా చేరాలని చురకలు'
అంతేకాదు, ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు ట్రంప్ చురకలు అంటించినట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య మంత్రిగా ఎంపిక చేసిన హోవార్డ్ లూట్నిక్‌తో కెనడా ఆర్థిక మంత్రి డొమినిక్ లే బ్లాంక్, విదేశాంగశాఖ మంత్రి మెలానీ జోలీ తాజాగా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
'భవిష్యత్తులో మరిన్ని చర్చలు'
ఇరుదేశాల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని ఈ భేటీ అనంతరం కెనడా మంత్రులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. కాగా కెనడాతో యూఎస్ వాణిజ్య లోటుపై అమెరికన్లు స్థిరంగా ఉన్నారని ఓ అధికారి పేర్కొన్నారు. డిసెంబరు మొదట్లో ట్రంప్, ట్రూడో భేటీకి కొనసాగింపుగా ఈ చర్చలు జరిగినట్లు వెల్లడించారు.
ట్రంప్ హెచ్చరికలు
అమెరికా-కెనడా సరిహద్దు వద్ద భద్రతను పెంచడానికి తాము తీసుకోబోయే చర్యల గురించి, 'ఫెంటనిల్' డ్రగ్ వల్ల అమెరికా, కెనడా ప్రజలకు కలిగే హానిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన భాగస్వామ్య చర్యలపై మాట్లాడినట్లు స్పష్టం చేశారు. కాగా ఈ డ్రగ్‌ను చైనా తమ దేశంలోకి డంప్ చేస్తుందనే కారణంతో ఆ దేశంపై 25 శాతం అదనపు టారిఫ్‌ను విధిస్తానని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
కెనడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం
గతేడాది కెనడా నుంచి అమెరికాకు దాదాపు 423 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఈ ఉత్పత్తులపై 20 లక్షల మంది కెనడావాసుల ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయి. కెనడా వస్తు, సేవల ఎగుమతుల్లో 75 శాతం అమెరికాకే ఉంటాయి. ఈ క్రమంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీంతో ట్రూడో సర్కార్ అప్రమత్తమైంది. ఈ సుంకాలు పెంచితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.