Car Accessories Buying Tips : మీరు బైక్/ కార్ కోసం యాక్సెసరీస్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆటోమొబైల్ యాక్సెసరీస్ (ఉపకరణాలు) కొనేటప్పుడు - నాణ్యత, భద్రత, వారెంటీ, ధర అనే నాలుగు ప్రధానమైన అంశాలను గుర్తుంచుకోవాలి. అప్పుడే మీకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ప్రీమియం కార్లు, బైక్‌ల్లో టాప్-ఎండ్ ఫీచర్లు ఉంటాయి. కానీ సాధారణ వాహనాల్లో ఇలాంటి మంచి, లేటెస్ట్ ఫీచర్లు ఉండకపోవచ్చు. కానీ ఇందులో చింతించాల్సి పనేమీ లేదు. అఫర్డబుల్ కార్లు లేదా బైక్‌లు కొనేవారు తమ వాహనాల్లో మంచి యాక్సెసరీస్‌ను పొందుపరుచుకునే వీలుంటుంది. అయితే చాలా మంది వాహనదారులు తమకు కావాల్సిన ఉపకరణాలను ఆన్‌లైన్‌లో, ఆఫ్టర్ మార్కెట్ షాపుల్లో కొంటూ ఉంటారు. మరికొందరు నేరుగా షోరూమ్ నుంచే వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అయితే వీటిలో ఏది బెస్ట్? షోరూమ్ నుంచి యాక్సెసరీస్ కొనడం వల్ల కలిగే లాభనష్టాలు ఏమిటి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- నాణ్యత (క్వాలిటీ) : నాణ్యమైన ఉపకరణాలు షోరూంలోనే కాదు, ఆఫ్టర్ మార్కెట్లోనూ లభిస్తాయి. అయితే షోరూమ్‌ల్లో ఆటోమొబైల్ కంపెనీకు సంబంధించిన యాక్సెసరీస్ లభిస్తాయి. కనుక ఇవి చాలా నాణ్యత కలిగి ఉంటాయి. అయితే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆఫ్టర్ మార్కెట్లోనూ ఇలాంటి యాక్సెసరీస్ దొరుకుతాయి. కానీ వాటి నాణ్యతను కచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
- ధర : ఆటోమొబైల్ షోరూమ్‌ల్లోని యాక్సెసరీస్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సాధారణ మార్కెట్లో ఇన్-కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ రూ.3000 వరకు ఉంటే, షోరూమ్‌లో అది రూ.4000 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని వాహనదారులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అనవసర ఖర్చులు వద్దు అనుకునేవారు సాధారణ మార్కెట్లోని మంచి యాక్సెసరీస్‌ను కొనుగోలు చేయవచ్చు.
- వారెంటీ : చాలా మంది తమ వాహనాలను మరింత అందంగా తీర్చుదిద్దుకోవడం కోసం యాక్సెసరీస్‌ను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు తమ బైక్/ కార్ పెర్ఫార్మెన్స్‌ను పెంచుకోవడం కోసం, ఆఫ్టర్ మార్కెట్ నుంచి ఉపకరణాలు కొని, వాటిని ఇన్‌స్టాల్ చేస్తుంటారు. అయితే వీటి వల్ల వాహనానికి సంబంధించిన ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ సెటప్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒక వేళ పొరపాటున ఇలాంటివి జరిగితే, మీ కారు లేదా బైక్‌కు సంబంధించిన వారంటీ, కాంపోనెంట్స్ వారెంటీ చెల్లకపోవచ్చు. అందుకే లైట్స్, డాష్‌క్యామ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ లాంటి యుటిలిసీ యాక్సెసరీస్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- భద్రత (సేఫ్టీ) : కారు ఉపకరణాలు కొనుగోలు చేసి, వాటిని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు చాలా మంది బుల్‌బార్స్ లాంటి ఉపకరణాలను ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఇవి కారు సేఫ్టీని మరింత మెరుగుపరుస్తున్నట్లు కనిప్తాయి. కానీ వాస్తవంలో ఇలా ఉండదు. ఇవి వాహనానికి భద్రత చేకూర్చకపోగా, తిరిగి మరింత నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. పైగా వాహన యజమానికి చట్టపరమైన ఇబ్బందులను కూడా కలిగించవచ్చు. కనుక మీ బైక్ లేదా కార్ కోసం కొత్త ఉపకరణాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ABS టూ TCS- కారులో మస్ట్‌గా ఉండాల్సిన టాప్ 10 సేఫ్టీ ఫీచర్స్ ఇవే!
కొత్త కారు కొంటున్నారా? ఈ 5 ఫీచర్స్ ఉంటే ఫుల్ కంఫర్ట్, సేఫ్ జర్నీ!