Heart Attack Problems In Telangana : తెలంగాణ కొన్ని జిల్లాలో గుండె సమస్యలు రానురానూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారపు అలవాట్లలో మార్పు, జీవనశైలి ఇందుకు కారణమని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఐదు ప్రధాన జిల్లా ఆస్పత్రులకు గుండె సమస్యలతో వచ్చేవారే వేలమంది ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో, హైదరాబాద్‌లో వైద్యం చేయించుకునే వారు కలిపి ఇంతకు మూడురెట్లు ఉంటారని అంచనా వేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో గుండె సమస్యలు : మహబూబ్‌నగర్ ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సుదర్శన్‌కు ఇంటి వద్దనే శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఆస్పత్రికి తరలించేలోగా శ్వాస ఆగింది వెంటనే ముగ్గురు వ్యక్తులు సీపీఆర్ చేశాక స్పృహలోకి వచ్చారు. హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
చలికాలంలో ఎక్కువగా గుండెపోట్లు : ఎండాకాలం, వర్షాకాలంతో పోల్చితే చలికాలంలో ఎక్కువగా గుండెపోట్లు వస్తున్నాయి. చల్లని వాతావరణానికి రక్తనాళాలు సంకోచం చెంది రక్తప్రవాహం తగ్గి గుండె ఒత్తిడికి గురవుతుంది. రక్తపీడనం ఎక్కువైతే గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. వాతావరణానికి తోడు మన దేహధర్మానికి మించి శారీరక శ్రమ, నిద్రలేకపోవడం, పనిలో ఒత్తిడికి లోనవడం, మానసిక సమస్యలు గుండె జబ్బులు వచ్చేలా చేస్తాయి.
గుండెపై తీవ్ర ప్రభావం : చలికాలంలో రక్తం చిక్కగా తయారవుతుంది. దీంతో బీపీ పెరగడం, కండరాలు, నాడులు బిగించుకపోవడం జరుగుతాయి. రోజూ అలవాటయ్యే వ్యాయామం కూడా చాలామంది ఆపేస్తుండటం వల్ల కూడా ఇబ్బందే. సూర్యుని కిరణాలు మనపై పడకపోయినా, జంక్‌పుడ్ ఎక్కువగా తిన్నా గుండెపై తీవ్ర ప్రభావం పడతాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వెచ్చగా ఉండటానికి ఉన్ని దస్తులు వేసుకోవడం, శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం, ఇప్పటికే వాడుతున్న ఔషధాలు క్రమ తప్పకుండా కొనసాగించడం, వైద్యుడిని సంప్రదించడం చేయాలని తెలుపుతున్నారు.
తేలికపాటి వ్యాయామాలే మేలు : చలిలో ఎలాంటి రక్షణ లేకుండా వ్యాయమాలు చేయరాదని నిపుణులు తెలుపుతున్నారు. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్టిసోల్ (ఒత్తిడి హార్మోన్స్) ఎక్కువతాయి. రక్తం గడ్డకట్టే ధోరణి ఉదయం పూటే ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణంలో వ్యాయామం చేయాల్సి వస్తే నెమ్మదిగా ప్రారంభించి శరీరానికి విశ్రాంతినిస్తూ మోతాదు పెంచాలి. చలిలో బయట కాకుండా ఇంటి పరిసరాల్లోనే నడక, వ్యాయామాలు, ధ్యానం, ప్రాణాయామం చేస్తే ప్రయోజనం ఉంటుంది.
వేడి వాతావరణం శ్రేయస్కరం : మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెవులు, తల, చేతులు, కాళ్లని చలి నుంచి రక్షించుకోవాలి. ధూమపానం, మద్యం అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికపుప్పుడు రక్తపోటును పరీక్షించుకుంటూ నియంత్రించుకోవడం మంచిది. కూరగాయలు, పండ్లు, గింజలు, ప్యాటీ ఆమ్లాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తినాలి. వేడి సూప్స్, గోరు వెచ్చని నీరు తాగటం శ్రేయస్కరం. చలిలో దాహం అనిపించకపోయినా తగినంత నీరు తాగాలి.
"చలాకాలంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి 10 నుంచి ఉదయం 5గంటల మధ్య ఛాతినొప్పి, తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు.అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయం 7గంటల తర్వాత వ్యాయామం చేయాలి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చన్నీటి స్నానం చేయాల్సి వస్తే వైద్యుని సలహా తీసుకోవాలి." -డా.మహేశ్ బాబు, గుండె వ్యాధుల నిపుణులు
మీ స్టెంట్స్ సరిగ్గా పని చేస్తున్నాయా? గుండె పేస్‌మేకర్ ఎంత కాలం పనిచేస్తుంది?
ఇవి తింటే గుండె సమస్యలు రావట! - పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి!