Manmohan Singh Final Rites : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి మజిలీ ముగిసింది. దిల్లీలోని నిగమ్ బోథ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ అధికారలాంఛనాలతో మన్మోహన్ పార్థివదేహానికి అధికారులు అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ , ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్ రాజు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సహా ఇతర కేంద్రమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌తో పాటు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
వారంతా వరుసగా మన్మోహన్ పార్థివదేహానికి సైనిక లాంఛనాల నడుమ పుష్పగుచ్ఛాలు సమర్పించారు. అనంతరం మన్మోహన్ పార్థివదేహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుష్పగుచ్ఛం సమర్పించి సెల్యూట్ చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో పాటు త్రివిధ దళాధిపతులు మన్మోహన్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తర్వాత గౌరవ వందనం చేసిన త్రివిధదళాల అధికారులు పేటికపై ఉన్న పూలు, జాతీయ జెండాను తొలగించారు. మన్మోహన్ బంధువులు, మతపెద్దలతో పాటు రాహుల్ గాంధీ పాడే మోస్తూ నిగమ్ బోధ్ ఘాట్ లో చితి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సిక్కు మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం చితిని పేర్చి పార్థివదేహాన్ని దహనం చేశారు.
.VIDEO | Former PM Manmohan Singh cremated at Nigambodh Ghat, Delhi, with full state honours.
— Press Trust of India (@PTI_News) December 28, 2024
(Source: Third Party)#ManmohanSingh pic.twitter.com/zWZ4Dd1KhS
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్థీవ దేహం
అంతకుముందు ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు నివాళులర్పించారు. అలాగే మన్మోహన్ పార్థివ దేహానికి ఆయన భార్య, కుటుంబ సభ్యులు సైతం నివాళులర్పించారు.
జో బైడెన్ సంతాపం
మన్మోహన్ సింగ్ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. అమెరికా, భారత్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని బైడెన్ కొనియాడారు. మాజీ ప్రధాని సతీమణి గురుశరణ్ సింగ్, కుటుంబసభ్యులకు బైడెన్ దంపతులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రముఖుల నివాళులు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి దిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. అనంతరం మన్మోహన్ పార్థీవదేహాన్ని దిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడే శుక్రవారం అంతా ఉంచారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సహా ఇతర పార్టీల నాయకులు మన్మోహన్ బౌతికకాయానికి నివాళులర్పించారు. శనివారం ఉదయం ప్రజల సందర్శనార్థం మన్మోహన్ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు.
ప్రధానిగా పదేళ్లు
దేశానికి 13వ ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. 2004-2014 మధ్య భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. ప్రస్తుత పాకిస్థాన్ లోని పంజాబ్ లో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చింది. మన్మోహన్ 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్ గా, 1991-96 మధ్య పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు.
కీలక సంస్కరణలు
మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎల్పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1998-2004 మధ్య రాజ్యసభ ప్రతిపక్ష నేతగా పనిచేశారు. సుమారు 33 ఏళ్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అంతేకాకుండా యూజీసీ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ గానూ మన్మోహన్ సేవలందించారు.
పురస్కారాలు
మన్మోహన్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1987లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. 2017లో మన్మోహన్ సింగ్‌ను ఇందిరా గాంధీ బహుమతి వరించింది. 1993, 94 ఉత్తమ ఆర్థికమంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు మన్మోహన్. 2010లో ఆయనకు వరల్డ్ స్టేట్స్‌మెన్ అవార్డు వరించింది.