India Vs England 4th T20 : ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. పుణె వేదికగా జరిగిన కీలకమైన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయబావుటా ఎగురవేసింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హ్యారీ బ్రూక్ (51; 26 బంతుల్లో 5×4,2×6) అర్ధ శతకంతో వీరోచిత పోరాటం చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
ఓపెనర్లు మెరిపించినా?
లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ జట్టు ప్రారంభంలో చాలా దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (23), డకెట్ (39) వరుస బౌండరీలు బాదారు. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రవి బిష్ణోయ్ విడగొట్టాడు. ఇంగ్లాండ్ స్కోరు 62 పరుగులు ఉన్నప్పుడు, భారీషాట్‌కు ప్రయత్నించిన డకెట్ సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే మరో ఓపెనర్ సాల్ట్ కూడా అక్షర్ పటేల్ వేసిన బంతికి బౌల్డయ్యాడు. తొలి డౌన్‌లో వచ్చిన బట్లర్ (2)ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడిపోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన వారిలో ఓవర్టిన్ (19) తప్ప మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అయ్యారు.
భారత్ టాప్ ఆర్డర్ విఫలమైనా
ఈ నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. ఓపెనర్లు సంజు శాంసన్ (1), అభిషేక్ శర్మ (29) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్‌గా వెనుదిరిగారు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి మహమూద్ భారత్ జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాడు. అయితే మూడో డౌన్‌లో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ (30; 26 బంతుల్లో 4×4, 1×6) కాసేపు మెరుపులు మెరిపించాడు. అయితే, జట్టు స్కోరు 79 పరుగుల వద్ద కార్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రషీద్ చేతికి చిక్కాడు. కానీ ఆల్ రౌండర్లు శివమ్ దూబె (53; 34 బంతుల్లో 7×4,2×6), హార్దిక్ పాండ్య (53;30 బంతుల్లో 4×4, 4×6) వీరోచిత ఇన్నింగ్స్ ఆడి అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు.