తమిళనాట మరోసారి శపథ రాజకీయాలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డీఎంకేను గద్దె దించే వరకు శపథం చేసిన ఆయన, ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు చెప్పులు ధరించనని గురువారం తెలిపారు. తాజాగా ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగన్‌కు మొక్కు చెల్లించుకున్నారు. అసలు ఏం జరుగుతోందంటే?
Annamalai Whips Himself : చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై అత్యాచార ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయని, దీనికి అధికార డీఎంకే ప్రభుత్వమే కారణమని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో అన్నామలై డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను పాదరక్షలు ధరించబోనని ప్రతినబూనారు.
"డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను పాదరక్షలు ధరించను. చెప్పులు లేకుండానే నడుస్తా. ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులు ఎరగా చూపం. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తాం. విజయం సాధించేంత వరకు చెప్పులు ధరించను. రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేతాలు దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపడతాను. కోయంబత్తూరులోని తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటాను" అని అన్నామలై గురువారం తెలిపారు.
#WATCH | Coimbatore | Tamil Nadu BJP president K Annamalai self-whips himself as a mark of protest to demand justice in the Anna University alleged sexual assault case. pic.twitter.com/ZoEhSsoo1r
— ANI (@ANI) December 27, 2024
చెప్పినట్లే ఆరు కొరడా దెబ్బలు
ఆ మాట ప్రకారమే శుక్రవారం కోయంబత్తూర్‌లోని తన ఇంటి వద్ద బీజేపీ మద్దతుదారులు, మీడియా సమక్షంలో మొక్కు చెల్లించుకున్నారు. ఆరు కొరడా దెబ్బలు భరించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. లైంగిక వేధింపుల ఘటనను ఖండిస్తూ నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
"కొరడా దెబ్బలు భరించడం మన సంస్కృతిలో భాగమే. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి మాత్రమే వ్యతిరేకం. అన్నా యూనివర్శిటీలో వెలుగుచూసిన ఘటనపై చర్యలు తీసుకోవాలన్నదే మా లక్ష్యం. గతంలో ఎంతోమంది ఈ ప్రక్రియను అనుసరించారు. దేవుడికి మనల్ని మనం సమర్పించుకునే విధానమే ఇది" అని అన్నామలై తన చర్యను సమర్థించుకున్నారు.
మరోవైపు అన్నా యూనివర్సిటీకి చెందిన బాధిత విద్యార్థిని ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను లీక్ చేయడంపై అన్నామలై మండిపడ్డారు. ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా పోలీసు అధికారుల తీరు ఉందని విమర్శించారు. లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడుపై రౌడీషీట్ తెరవలేదని, డీఎంకేతో అతడికున్న సంబంధాలే అందుకు కారణమని ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.