Ex PM Manmohan Singh Passes Away : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థీవదేహానికి ముఖ్యమంత్రి నివాళి అర్పించారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం బెళగావి వెళ్లిన సీఎం, మాజీ ప్రధాని మరణవార్త తెలియగానే అక్కడి నుంచి నేరుగా దిల్లీ వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం నిష్కళంకమైన, సమగ్రమైన నిర్ణయాలు తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రాజకీయ, ప్రజా జీవితంలో మన్మోహన్ సింగ్ లెజెండ్‌గా ఉన్నారని సీఎం కీర్తించారు. దేశాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అనన్యంగా కీర్తించారు. మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సహా రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు ఉన్నారు. శనివారం నాటి అంత్యక్రియల్లో కొందరు నేతలు పాల్గొననున్నారు.
మాజీ ప్రధాన మన్మోహన్ మృతిపట్ల శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని శ్లాఘించారు. మన్మోహన్ మరణం దేశానికి, కాంగ్రెస్‌కి తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో నివాళి అర్పించారు. దేశ విత్త వ్యవస్థను ఆర్థిక సంస్కరణలతో పరుగులు పెట్టించడమే కాక అనేక చారిత్రక చట్టాలను తెచ్చిన ఘనత మన్మోహన్‌కే దక్కుతుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.
వారం పాటు అన్ని పార్టీకి చెందిన కార్యక్రమాలు రద్దు : మాజీ ప్రధాని మృతితో వారంపాటు పార్టీకి చెందిన అన్ని కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు పీసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం నాటి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాలతోపాటు జనవరి 3వ తేదీ వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేసినట్లు మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు.
కేసీఆర్ నివాళి : మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని మాజీ సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో తన విద్వత్తును ప్రదర్శించారంటూ కీర్తించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భంగా కొనియాడారు. మన్మోహన్ మృతిపట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంతాపం తెలిపారు. మన్మోహన్ అంత్యక్రియలకు కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎంపీలు హాజరుకానున్నారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి..
బీజేపీ కార్యక్రమాలు వాయిదా: మాజీ ప్రధాని మృతి పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంతాప సూచకంగా పార్టీ కార్యక్రమాలు వాయిదా వేశామని తెలిపారు. జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులర్పించారు. పార్టీ కార్యాలయాలు, పట్టణాల చౌరస్తాల్లో మన్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ ఏర్పాటుతో పాటు మరెన్నో - మన్మోహన్ హయాంలో జరిగిన కీలక పరిణామాలివే!
వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీల్లో చదువు- మన్మోహన్ సింగ్ కుమార్తెలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?