'రైతులకు ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ప్రభుత్వం' - ప్రధాని మోదీ ఈటీవీ భారత్
చర్చల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని.. అఖిలపక్ష సమావేశం వేదికగా విపక్షాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపినట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్ భేటీలో.. మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్రం చేసిన ప్రతిపాదన ఇంకా అలాగే ఉందని.. వివిధ పార్టీల సభాపక్ష నేతలకు మోదీ వివరించినట్టు తెలుస్తోంది.
వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపివేసే ప్రతిపాదనకు ఇప్పటికీ కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం ఇప్పటికీ సిద్ధంగానే ఉందని వెల్లడించారు.
'కేంద్రం రైతుల సమస్యను పెద్ద మనసుతో పరిశీలిస్తోందని ప్రధాని అఖిల పక్ష సమావేశంలో హామీ ఇచ్చారు. జనవరి 22న వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉంది. తోమర్ జీ మీతో చర్చించడానికి ఫోన్ కాల్ దూరంలో ఉంటారనే విషయాన్ని ఈ సమావేశంలో ప్రధాని మరోసారి గుర్తు చేశారు,' అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.
రైతులు, కేంద్రం మధ్య తొమ్మిది దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో.. ఏడాదిన్నర పాటు చట్టాలను నిలిపివేసే ప్రతిపాదనను కేంద్రం అన్నదాతల ముందు ఉంచింది. రైతులు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టారు. చివరి దఫా చర్చలు కూడా విఫలం కావడంతో..'బంతి మీ కోర్టులోనే ఉంది. చట్టాలు రద్దు మినహా..మేము సూచించినదానికంటే మెరుగైన ఆలోచన ఉంటే చెప్పాలి' అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాలకు సూచించారు. చట్టాల రద్దుకే పట్టుబట్టిన రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఎర్రకోట దగ్గర నిరసనలు వ్యక్తం చేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, సాగు చట్టాలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ.. పార్లమెంట్ ఉభయసభల ప్రారంభ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. ప్రస్తుతం దిల్లీ శివారుల్లో రైతుల నిరసన కొనసాగుతోంది.
ఇదీ చూడండి:- దిల్లీ సరిహద్దులో రైతుల ఉపవాస దీక్ష