మళ్లీ డేంజర్ మార్క్ దాటిన 'యమున'!.. డ్రోన్ విజువల్స్ చూశారా? - యమునా నదిలో పెరిగిన నీటిమట్టం డ్రోన్ వీడియో
🎬 Watch Now: Feature Video
Yamuna Water Level In Delhi : యుమునా నదిలో కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన నీటిమట్టం.. మళ్లీ ప్రమాద స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయి 205.33 మీటర్లు కంటే స్వల్పంగా పెరిగి 205.90 మీటర్లకు చేరింది. సాయంత్రానికి ఇది 206.7 మీటర్ల వరకు చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజీకి వరద పొటెత్తింది. దీంతో 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ కారణంగా దిల్లీలో యమునా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.
హిండన్ నది నీటిమట్టం పెరగడం వల్ల నోయిడాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. అడిషనల్ సీపీ సురేశ్రావు కులకర్ణి తెలిపారు. నీటిమట్టాన్ని పర్యవేక్షిస్తూ అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
జులై 10 సాయంత్రం 5 గంటలకు యమునా నది నీటిమట్టం ప్రమాద స్థాయిని అధిగమించింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో వరదల సంభవించాయి. నీటిమట్టం క్రమంగా 208.66 మీటర్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. జులై 13 తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే గత రెండు-మూడు రోజులుగా నీటి మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నాయి. జులై 18న ప్రమాద స్థాయి కంటే నీటిమట్టం దిగువకు వచ్చింది. ప్రస్తుతం మళ్లీ పెరిగింది. అయితే, నీటిమట్టం పెరిగితే మంచినీటి ఎద్దడి ఎదురవుతుందని.. వరద పరిస్థతి సంభవిస్తుందని శనివారం దిల్లీ మంత్రి అతిషీ ఓ ప్రకటనలో తెలిపారు.