Indians Deported From US : అమెరికా నుంచి భారత్‌కు వెనక్కి వచ్చిన వారి జీవితాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అమెరికా అని కలలు కంటూ, తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకొని అక్కడికి వెళ్లిన వారి ఆశలు అడియాశలయ్యాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ క్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి
చిన్న బోటులో మెక్సికోకు
పంజాబ్‌కు చెందిన హర్వీందర్ సింగ్ కుటుంబం కోసం కొంత డబ్బు వెనక వేద్దామనుకున్నాడు. అమెరికాలో పని వీసా ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్‌కు రూ.42 లక్షలు ముట్టజెప్పాడు. తర్వాత వీసా రాలేదని చెప్పడం వల్ల కొందరు మధ్యవర్తుల ద్వారా దిల్లీ నుంచి ఖతార్, అక్కడి నుంచి బ్రెజిల్ చేరుకున్నాడు. తర్వాత పెరూలో విమానం ఎక్కిస్తానన్న మధ్యవర్తి అలాంటి ఏర్పాటు ఏదీ చేయలేదు. తర్వాత ట్యాక్సీల్లో కొలంబియా, పనామా తీసుకెళ్లారు. అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నారు. అదీ లేదు. 2 రోజులపాటు అక్రమ మార్గంలో తరలించిన తర్వాత ఒక చిన్నబోటులో మెక్సికో సరిహద్దుకు తీసుకెళ్లారు. 4 గంటలు ప్రయాణం తర్వాత బోటు తిరగబడి ఒకరు చనిపోయారని హర్వీందర్ సింగ్ చెప్పారు. చివరకు డంకీ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టిన హర్వీందర్ ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఎక్కడి నుంచి వెళ్లాడో అక్కడికే చేరాడు.
45 కిలోమీటర్ల ప్రయాణం
పంజాబ్‌లోని దారాపుర్‌కు చెందిన సుఖ్‌పాల్ సింగ్‌ది కూడా హర్వీందర్ లాంటి దీనగాథే. 15 గంటలపాటు సముద్ర ప్రయాణం చేసి తర్వాత 45 కిలోమీటర్లు పర్వత ప్రాంతంలో ప్రయాణించాడు. మధ్యలో జరగరానిది ఏదైనా జరిగితే అంతే సంగతులు. బతుకుపై ఆశ వదులుకోక తప్పదని అన్నాడు. దారి వెంట ఎన్నో మృతదేహాలను చూసినట్లు సుఖ్‌పాల్ తెలిపాడు. మెక్సికో సరిహద్దు వద్ద తమను అరెస్టు చేసి 14 రోజులపాటు చీకటి గదుల్లో బంధించారని చెప్పాడు. అక్కడ వేలాది మంది పంజాబీ యువతది ఇదే దుస్థితి అని చెప్పాడు. అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని సుఖ్‌పాల్ తెలిపాడు.
11 రోజుల కస్టడీ
భారత్ తిరిగొచ్చిన 104 మంది అక్రమ వలసదారుల్లో జస్పాల్ సింగ్ ఒకరు. తనను అమెరికాలో పట్టుకున్న తర్వాత చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు వేసి బంధించారని, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుకు వచ్చేవరకు అవి అలాగే ఉన్నాయని విలపిస్తూ తెలిపాడు. గురుదాస్‌పుర్‌కు చెందిన 36ఏళ్ల జస్‌పాల్ జనవరి 24న మెక్సికో సరిహద్దు దాటిన వెంటనే అమెరికా పెట్రోలింగ్ పార్టీకి దొరికిపోయాడు. 30 లక్షలు ఇస్తే అమెరికా పంపిస్తానంటూ మాయమాటలు చెప్పిన ఏజెంట్ మోసంచేసి బ్రెజిల్ గుండా తరలించాడు. 6 నెలలు బ్రెజిల్‌లో ఉండాల్సి వచ్చిందని జస్పాల్ చెప్పాడు. జస్పాల్‌ను అరెస్టు చేసిన అమెరికా పోలీసులు 11రోజులు కస్టడీలో ఉంచుకొని ఆ తర్వాత వెనక్కి పంపారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడి యంత్రాంగం అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టింది. భారత్‌కు చెందిన 17వేల మందికి పైగా అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించారు. ట్రంప్ సర్కార్ తొలి విడతలో సైనిక విమానంలో 104 మందిని బుధవారం వెనక్కి పంపింది. వారిలో పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, చండీగఢ్‌కు చెందినవారు ఉన్నారు.